Monday, November 25, 2024

పత్రికలు ప్రజాస్వామ్య పుత్రికలు : వెంక‌య్య నాయుడు

ప్రజాపక్షం వహించినప్పుడే పాత్రికేయానికి విలువ పెరుగుతుందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనకు నెల్లూరుకు విచ్చేసిన ఆయన శుక్రవారం సాయంత్రం నెల్లూరు రూరల్‌ కనుపర్తిపాడులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో వేడుకగా జరిగిన ప్రముఖ వార పత్రిక 40వ వార్షికోత్సవ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 40 మంది ప్రముఖులకు జ్ఞాపికలు అందజేశారు. నెల్లూరుకు చెందిన ప్రముఖులు జీవిత విశేషాలతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తెలుగు మాటలు, తెలుగు కట్టు, బొట్టు చాల రోజుల తరువాత చూడటం సంతోషంగా ఉందన్నారు. జనంతో కలసి జనంతో మాట్లాడుతుంటే ఉండే ఆనందం, రాజ్యాంగ హోదా అయిన ఉప రాష్ట్రపతిలో లేదని , ఆ పదవి కేవలం అలంకారానికి మాత్రమేనన్నారు. అంత:కరణంగా సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసి తిరగాలన్నారు. తమ కాలంలో రాజకీయాలు వేరని , ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు రోత పుట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


పత్రికలన్నా .. పాత్రికేయులన్నా నాకు ప్రత్యేక అభిమానం :
రాజకీయ రంగంలో ప్రవేశించిన తొలినాళ్ల నుంచి పాత్రికేయులన్నా, పత్రికలన్నా తనకెంతోఅభిమానమని చెప్పిన ఉప రాష్ట్రపతి ఈ రోజుల్లో ఒక పత్రికలో వార్తలు చదివితే నిజాలు తెలియడంలేదని , ఒక్కో పత్రిక ఒక్కో ప్రక్క కొమ్ముకాస్తుండటం వల్ల రాజకీయాల్లో లాగానే పత్రికా రంగంలో కూడా విలువలు పడిపోయాయన్నారు. అయితే పత్రికలు, మీడియాను నడపడం అంత సులువైన మార్గమేమీ కాదని ఆయన అన్నారు. భాష విషయంలో పత్రికలు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ప్రజల భాషను పత్రికలు స్వీకరిస్తే, పత్రికా భాషను ప్రజలు అర్ధం చేసుకుంటారన్నారు. పత్రికలకు మూలం భాషయేనని, ఆ భాష సక్రమంగా లేనప్పుడు పత్రికల మనుగడ కూడా ప్రశ్నార్థకమౌతుందన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం పత్రికలు నడుం బిగించాలని , భాషా పరిరక్షణ కోసం ప్రతి పత్రిక కృషి చేయాలన్నారు. భాష విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటే మన పత్రిక విలువ అంత పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం , మహిళల సాధికారతతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి కీలకమన్న ఉపరాష్ట్రపతి.. మహిళలు, అన్నదాతల కోసం పత్రికలు పని చేయాలన్నారు. వారిలో స్ఫూర్తిని పెంచే విధంగా కథనాలు, వార్తలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామానికి పత్రిక చేరుతోందని,ప్రసార సాధనాల విస్తృతి పెరిగిందని , అయితే గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని పత్రికలు, ప్రసార సాధనాలు నిబద్ధతతో కృషి చేస్తున్నాయనే విషయాన్ని ప్రశ్నించుకోవాలన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలోనూ ఎంతో మంది పాత్రికేయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు వార్తలను అందించేందుకు తపించారన్న ఉపరాష్ట్రపతి, కర్తవ్య నిర్వహణలో కరోనా మహమ్మారి కారణంగా అసువులు బాసిన జర్నలిస్టులందరి స్మృతికి నివాళులు అర్పిస్తూ, వారి కుటు-ంబాలకు సానుభూతి తెలియజేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు పాత్రికేయు లు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. ఆ సమయంలో వారి కుటుంబాలకు తనకు చేతనైన సాయం కూడా చేశానని తెలిపారు.పత్రికలు ఏర్పాటు-చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని నడిపించడం అంతకన్నా కష్టమైన విషయమన్న ఉపరాష్ట్రపతి.. జిల్లా కేంద్రంగా ఓ పత్రిక 40వ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి,లోక్‌ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ గుండ్రా సతీష్‌ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శ్రీనాథ్‌ రెడ్డి, టీటీడీ న్యూఢిల్లి సమన్వయకర్త వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , పత్రికా అధినేత తుంగా శివప్రభాత్‌ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.


కేవీ రత్నంను పరామర్శించిన ఉప రాష్ట్రపతి :
అనంతరం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ విద్యావేత్త కేవీ రత్నంను పరామర్శించారు. నగరంలోని హరనాధపురంలో గల రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం నివాసానికి ఆయన విచ్చేశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నంతో మాట్లాడి ఆయన ఆరోగ్య స్థితిగతులను కుటు-ంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రత్నం సతీమణి పద్మావతి, కుమారులు వేణుగోపాల్‌, కిషోర్‌తో కాసేపు మాట్లాడారు. తమ ఇంటికి విచ్చేసిన ఉపరాష్ట్రపతికి రత్నం కుమారులు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె దీపా వెంకట్‌ ఉన్నారు.

- Advertisement -


వెంకటాచలంలో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం :
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రత్యేక రైలులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం 12 గంటలకు వెంకటాచలం రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన కాన్వాయ్‌ లో స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటాచలం రైల్వే స్టేషన్‌లో జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ విజయరావు, జాయింట్‌ కలెక్టర్లు హరేందిర ప్రసాద్‌, గణేష్‌ కుమార్‌, విదేహ్‌ ఖరే, టైనీ కలెక్టర్‌ ఫర్హాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవోలు చైత్రవర్షిని, శీనానాయక్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సురేంద్ర రెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement