కర్నూల్ జిల్లా కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్న ముఠాను ఎక్సైజ్, సెబీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తెలుగు శ్రీనివాసులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం ముఠాకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సహాయ పర్యవేక్షణాధికారి భరత్ నాయక్ వెల్లడించారు. తెలుగు శ్రీనివాసులుకు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా, మానవపాడు మండలం బొంకూరుకు చెందిన బోయ రమేష్ , వడ్డే పరమేష్ తో స్నేహం ఏర్పడింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కవగా ఉన్న సమయంలో తెలంగాణ నుండి రమేష్, పరమేష్ కర్నూల్ జిల్లాకు అక్రమంగా మద్యం సరఫరా చేసేవారు. అయితే ఈ క్రమంలోనే పలుమార్లు సెబ్ అధికారులకు రమేష్, పరమేష్ పట్టుబడ్డారు. ప్రస్తుతం ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో వీరు కల్తీ మద్యం తయారు చేయాలని భావించారు. ఇందుకు తెలుగు శ్రీనివాసులు సహకరిస్తానని అంగీకరించడంతో పరమేష్, రమేష్ నకీలీ మద్యం తయారీకి పూనుకొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో నకిలీ మద్యం తయారు చేయాలని భావించారు. శ్రీనివాసులు ఈ మేరకు రమేష్, పరమేష్ కు కల్తీ మద్యం తయారీకీ అవసరమైన ఏర్పాట్లు చేశారు.
లక్ష్మీపురంలో కల్తీ మద్యం తయారీ స్థావరం ఏర్పాటు
రమేష్, పరమేశ్, శ్రీనివాసులు ముఠాగా ఏర్పడి కల్తీ మద్యం ఉత్పత్తి స్టార్ట్ చేశారు. మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్ , రంగు నీళ్లు, పలు బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలు సేకరించి నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, రంగులు, సీసాలు, సీసా మూతలను బొంకూరు గ్రామానికి చెందిన లోకేష్ గౌడ్, కలుకుంట్ల నాగరాజ్ గౌడ్ సరఫరా చేసేవారు. ఆయా మద్యం కంపెనీల సీసాల్లో రంగునీళ్లు కలిపిన స్పిరిట్ ను నింపేవారు. ఈ కల్తీ మద్యం సీసాలను ఆయా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలించేవారు. ఈ నెల 6వ తేదీ నుండి నిందితులు నకిలీ మద్యం తయారీని ప్రారంభించారు.
అయితే నకిలీ మద్యం తయారీకి సంబందించిన సమాచారం అందుకొన్న వెంటనే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ బృందం లక్ష్మీపురంలోని నకిలీ మద్యం స్థావరంపై దాడి చేసింది. 20 లీటర్ల స్పిరిట్, 189 నకిలీ ఇంపిరీయల్ బ్లూ సీసాలు, 238 మద్యం సీసా మూతలను సీజ్ చేశారు. తెలుగు శ్రీనివాసులుతో పాటు పరమేష్, వడ్డే రమేష్, లోక్‌ష్ గౌడ్, కలుకుంట్ల నాగరాజు గౌడ్ పై కర్నూల్ సెబ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు.