Friday, September 6, 2024

Madanapalli – ఉద్యోగులపై అనుమానాలున్నాయి… సిసోడియా


ఆంధ్రప్రభ స్మార్ట్, మ‌ద‌న‌ప‌ల్లి : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహనంతో.. రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ భూముల పరిస్థితిని తెలుసుకునేందుకు.. అదే విధంగా తమ భూముల కబ్జాపై ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని డివిజన్ ప‌రిధిలోని రైతులు అధికారులకు తమ వ్యథలను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లాలో భూ కబ్జాలు, భూసమస్యలపై బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గురువారంతో ముగిసినప్పటికీ ఈ విషయం తెలియని పలువురు బాధితులు శుక్రవారం ఉదయం నుంచి మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని పడిగాపులు కాశారు. పోలీసులు బాధితులను అనుమతించకపోవడంతో వారంతా గేటు వద్దనే వేచి ఉన్నారు.

సిసోడియా కారు అడ్డగింత

అదే సమయంలో కార్యాలయం నుంచి విజయవాడ బయల్దేరిన సిసోదియా కారును ఆపాలంటూ బాధితులు అడ్డుగా వెళ్లారు. దీంతో ఆయన కారు నుంచి దిగి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సిసోదియా మాట్లాడుతూ గురువారం ఒక్కరోజే 400 వరకు అర్జీలు వచ్చాయని.. శుక్రవారం 15 నుంచి 20 వరకు అందినట్లు తెలిపారు. వీటన్నింటిని పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయ దహనం, భూకబ్జాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు.

- Advertisement -

అనుమానితులపై సీఐడీ ఫోకస్

మరోవైపు సబ్‌కలెక్టర్‌ కార్యాయం దహనం ఘటనపై విచారణ కొనసాగుతోంది. పలువురు అనుమానితులను సీఐడీ, పోలీసులు విచారిస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించి ఆరా తీస్తున్నారు.. డీఎస్పీ కార్యాలయంలో సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్ నిన్న దీనిపై సమీక్ష నిర్వహించారు. నేడు కూడా వివిధ శాఖ అధికారుల‌తో మాట్లాడారు. అన‌త‌రం ఆయన విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఆర్డీవో హరిప్రసాద్‌, పూర్వ ఆర్డీవో మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌, వీఆర్‌ఏ రమణయ్యగత అయిదు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది, అనుమానితుల కాల్‌ డేటాను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఉద్యోగాలపై అనుమానాలు..

మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు సిసోడియా. మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే పరారీలో ఉన్నారని, మదనపల్లె ఘటనలో నాలుగు బృందాలు విచారణలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు.  ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లె నుంచి విజయవాడ వెళుతూ రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశమయ్యారు. రెవెన్యూ శాఖ రికార్డులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ, ఈ ఘటనలో ఏడుగురిని విచారిస్తున్నామని సిసోడియా వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే అనేక వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఘటన జరిగిన కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిపై అనుమానం ఉందని తెలిపారు. త్వరలో శాఖాపరమైన చర్యలు చేపడతామని, కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని, మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం చేశారు. 

మంటల్లో కాలిపోయిన రికార్డుల రికవరీకి అవకాశముందని సిసోడియా పేర్కొన్నారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులు పరిశీలించామని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత డి-పట్టాలు ఫ్రీహోల్డ్ లోకి వెళ్లిపోతాయన్న భావనతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని వివరించారు. 

అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2.16 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ అయిందని, అందులో 4,400 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు. ఫ్రీహోల్డ్ పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని సిసోడియా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement