Friday, November 22, 2024

Macharla – అజ్ఞాతంలో కాదు…హైద‌రాబాద్ లో…క్లారిటీ ఇచ్చిన పిన్నెల్లి

ఏపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధంలో చేశారు. కానీ గురువారం రాత్రి నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ కనిపించడం లేదు. దీంతో ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు.
తాము అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తమకు ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లానని వెల్లడించారు. అలాగే తమపై ఎలాంటి కేసులు కూడా లేవని స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉంటే …

ఈ నెల 13 ఏపీలో ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో అల్లర్లు జరగడంతో జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేసింది. కలెక్టర్‌ను బదిలీ చేసింది. అలాగే పలువురు ఉన్నతాధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అలాగే సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు. అయితే గన్‌మెన్లను కూడా వదిలేసి వారిద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్‌మెన్లు ఉన్నతాధికారులను కలిసి సమాచారం అందించారు. దీంతో కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టు చేస్తారనే భయంతోనే వాళ్లిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు స్పందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement