సూళ్లూరుపేట(శ్రీహరికోట), ప్రభన్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం3 (ఎల్‌వీఎం 3-ఎం3) రాకెట్ ప్రయోగానికి చేపట్టేందుకు ఇస్రో సర్వం సిద్దం చేసింది. పూర్తి వాణిజ్య పరంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. న్యూస్ స్పెస్ ఇండియా లిమిటెడ్, వన్‌వెబ్ ఒప్పందం ప్రకారం యుకేకు చెందిన 36 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 108 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా గత ఏడాది అక్టోబర్ 23 జీఎస్‌ఎల్‌వీ -మార్క్ 3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మరోమారు 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం 3-ఎం3 రాకెట్ ద్వారా ఆదివారం ఉదయం 9గంటలకు నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో షార్‌లో హుషార్ మొదలయ్యింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ల్యాంచ్ ప్యాడ్ ఇందుకు వేదికగా మారనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ రిహార్సల్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. షార్‌లోని రాకెట్ అనుసంధాన భవనంలో రాకెట్ శిఖరభాగాన యుకేకు చెందిన 36 ఉపగ్రహాలను అమర్చి రెండవ ప్రయోగ వేదికపైకి ఎల్‌వీఎం 3-ఎం3 రాకెట్‌ను చేరవేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్‌ను విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలు ఆ డేటాను సేకరించారు. శుక్రవారం ఎంఆర్‌ఆర్ (మిషన్ రెడినెస్ రివ్యూ) సమావేశం నిర్వహించిన అనంతరం లాంచ్ ఆధరైజేషన్ బోర్డు సమావేశంలో రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
దీంతో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌండ్ డౌన్‌ను ప్రారంభించారు. 24.30 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. మూడు దశల రాకెట్‌లో మొదటి దశలో 200 టన్నుల ఘన ఇంధన స్ట్రాపన్ బూస్టర్లలో ఇంధనాన్ని నింపి ఉన్నారు. అదేవిధంగా రెండవ దశలో 110 టన్నుల బరువు గల ధ్రవ ఇంధనాన్ని నింపుతున్నారు. మూడవ దశలోని 25 టన్నుల క్రయోజనిక్ ఇంజన్‌లో క్రయో ఇంధ నాన్ని నింపి ఉన్నారు. వాహనంలో ఇంధనాన్ని నింపిన అనంతరం ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో పాటు భూస్థిర పరీక్షలను నిర్వహించి రాకెట్‌ను పూర్తిస్థాయిలో ప్రయోగానికి సిద్దం చేయనున్నారు.
ఆదివారం 9 గంటలకు కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్ తన గమనాన్ని ప్రారంభించనుంది. 20 నిమిషాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన అనంతరం రాకెట్ అగ్రభాగాన ఉంచిన 5805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు. ఎల్‌వీఎం 3-ఎం3 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు.