అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త కళ సంతరించుకుంటోంది. అత్యంత ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో స్టార్ హోటల్స్, విల్లాల సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. మొత్తం మీద పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
ముఖ్యంగా లగ్జరీ విల్లాలు, స్టార్ హోటల్స్ నిర్మాణంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పర్యాటక పాలసీ రూపొందించింది. పర్యాటక రంగంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త విధానంలో పలు సానుకూల అంశాలు పొందుపరిచింది.
సింగిల్ విండో విధానంలో అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి, విద్యుత్ సౌకర్యాలు..ఇలా అన్నింటిని సకాలంలో అందించేలా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇదే సమయంలో పర్యాటక రంగం అభివృద్ధిలో కీలక భూమిక పోషించే ట్రావెల్ రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
పర్యాటక రంగం అభివృద్ధితో ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకు తగిన వసతులు ఉండాలి. ప్రపంచస్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కలిపించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పలు కార్యచరణలు సిద్ధం చేసింది.
లగ్జరీ విల్లాల నిర్మాణం ఎక్కడంటే…
ఏపీ పర్యాటకం రంగానికే తలమానికమైన విశాఖపట్టణం జిల్లా అన్నవరం, కడప జిల్లా గండికోటలో లగ్జరీ విల్లాల నిర్మాణం చేపట్టబోతున్నారు. విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నం మండలంలోని అన్నవరం గ్రామంలో లగ్జరీ విల్లాల నిర్మాణం కోసం 40 ఎకరాల భూమిని కేటాయించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మేఫెయిర్ హోటల్స్, రిసార్ట్స్ సంస్థ ఇక్కడ ఖరీదైన విల్లాలను నిర్మించ నుంది.
రూ.525 కోట్ల వ్యయంతో 250 విల్లాలను ఇక్కడ నిర్మించనున్నారు. తద్వారా రెండు వేల మంది వరకు ఉపాధి లభించడంతోపాటు రానున్న రోజుల్లో రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున ఆదాయం రానుంది. కడప జిల్లా గండికోటలో ముంతాజ్ హోటల్స్ సంస్థ 120 ఖరీదైన విల్లాలను నిర్మించనుంది. లీజు విధానంలో ఇక్కడ విల్లాలను ఆ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే వీటి నిర్మాణం కూడా జరుగుతున్నట్లు అధికారుల సమాచారం.
ఫైవ్‌స్టార్ హోటల్స్
రానున్న రోజుల్లో తిరుపతి, పేరూరులో ఐదు నక్షత్రాల హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.
కేబినెట్ అనుమతి
గత జూలైలో నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఇందుకు సంబంధించి అనుమతులను మంజూరు చేశారు. ఆయా సంస్థలకు ఎంత మేర భూములు కేటాయించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రూ.70 కోట్ల నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా, నిరంతరాయ విద్యుత్ వంటి పలు అంశాల కోసం ఈ మొత్తాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
గ్లోబల్ గుర్తింపు..
ప్రపంచ పర్యాటక రంగం ముఖ చిత్రంలో ఏపీ కీలక స్థానంలో ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి లక్ష్యం. ఇప్పటికే ఈ దిశగా పర్యాటక రంగం అభివృద్ధి, బ్రాండింగ్ ప్రమోషన్ వంటి పలు అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సుందరమైన సముద్ర తీరాలు, రిజ ర్వాయర్లు, బీచ్‌లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని పలు సమావేశాల్లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో ఆతిథ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ఆతిథ్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టార్ హోటల్స్, రిసార్టులు, విల్లాలు నిర్మిస్తే దేశీయ పర్యాట కులతో పాటు ప్రపంచ పర్యాటకుల రాక పెరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇదే క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి పెద్దఎత్తున కార్యాచరణ రూపొందించి అనుమతులు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించి పెట్టడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష విధానంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు పర్యాటక రంగం ద్వారా రానున్నాయనడంలో సందేహం లేదు.