Wednesday, November 20, 2024

అంగన్‌వాడీల్లో జూలై 1నుంచి మధ్యాహ్న భోజనం.. మెనూ సిద్ధం చేసిన యంత్రాంగం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ ల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు సర్వం సిద్ధమైంది. గర్భిణీలు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో నిలుపుదల చేశారు. రెండేళ్ల అనంతరం తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని జూలై 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ చేస్తోంది. గత రెండేళ్లుగా గర్భిణీలు, బాలింతలకు ముడిసరుకుల ద్వారా పోషకాలను అంగన్‌వాడీలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడి కరోనా అదుపులోకి రావడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజన పోషకాలను అందించేందుకు శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే మూడు నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. రక్తహీనత, పోషకాహార లోపాల నివారణ ధ్యేయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనంతో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఉడికించిన గుడ్డుతో పాటు పాలును కూడా అందిస్తారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న ముడి పోషకాలను ఈ నెల 30వ తేదీ వరకు లబ్దిదారులకు అందిస్తారు. రానున్న 1వ తేదీ నుంచి బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించిన మెనూను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే రూపొందించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు, ఐసీడీఎస్‌ సిబ్బందికి మెనూ వివరాలను పంపిణీ చేయడం జరిగింది. అన్నంతో పాటు విధిగా ఆకుకూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, టమోటా వంటి పోషకాలతో పప్పు, కోడిగుడ్డు కూర, అలాగే ఉడికించిన కోడిగుడ్డు, సాంబారుతో మెనూను రూపొందించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోషక విలువలు ఉన్న కూరగాయలు, ఆకుకూరలతో భోజనం ఉండేలా మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించడం జరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఈ మెనూను అంగన్‌వాడీల్లో అందించనున్నారు.

మెనూ ఇదే..

- Advertisement -

సోమవారం : తల్లులకు అన్నం దోసకాయ పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు.
పిల్లలకు అన్నం దోసకాయ పప్పు ఉడికించిన కోడిగుడ్డు-1 100 మి.లీ పాలు

మంగళవారం : అన్నం – టొమాటో పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు
పులిహోర టొమాటో పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు

బుధవారం : అన్నం ఆకుకూర పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు
అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు

గురువారం : ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఆకుకూర కూరగాయలతో సాంబారు 200 మి.లీ పాలు
అన్నం ఆకుకూర ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు

శుక్రవారం : అన్నం బీరకాయ లేదా మునగాకు లేదా పాలకూరతో గుడ్డు కూర 200 మి.లీ పాలు
అన్నం సొరకాయ పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు

శనివారం : వెజిటబుల్‌ రైస్‌ ఆకుకూర కూర కూరగాయలతో సాంబారు 200 మి.లీ పాలు
వెజిటబుల్‌ రైస్‌ ఆకుకూర కూర ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement