Tuesday, November 26, 2024

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఐఎండి సూచనల ప్రకారం నైరుతి మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం జాఫ్నా (శ్రీలం)కి తూర్పున 600 కి.మీ., కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 630 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని అన్నారు. ఇది వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు మరియు దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వివరించారు.

దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

అప్రమత్తం
మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాయుగుండం దృష్ట్యా సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని ముందస్తు చర్యల కోసం అప్రమత్తం చేసినట్లు- విపత్తుల సంస్థ ఎండి బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటు-లో ఉండే 1070, 18004250101, 08632377118 నెంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను అలర్ట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించింది. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కిందకు వెళ్ళొద్దని, కరెంట్‌ పోల్స్‌కు దూరంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంట ఆదివారం నుంచి మంగళవారం వరకు గంటకు 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో వాయుగుండం రైతాంగం కంటిపై కునుకులేకుండాచేస్తోంది. వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం చలితీవ్రత ఎక్కువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement