Monday, November 25, 2024

Cyclone Michaung:వాయుగుండ‌గా మారిన అల్ప‌పీడ‌నం… నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అల‌ర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాల గగనతలంపై కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 3వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.

రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం పుదుచ్చేరి, చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు- 740, బాపట్ల- 810, మచిలీపట్నం- 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, వచ్చే 24 గంటల్లో మిఛౌంగ్ తుఫాన్ గా మారుతుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం క్రమంగా ఇది ఏపీ తీరం వైపు దూసుకొస్తుందని అంచనా వేసింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం బాపట్ల- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నెల్లూరు, ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లా కలెక్టర్లు హరి నారాయణన్, ఏఎస్ దినేష్ కుమార్ తక్షణ చర్యలకు దిగారు. తీర ప్రాంతంపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టరేట్లల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. వాటి నంబర్లు నెల్లూరు కలెక్టరేట్ 1077, 0861 2331261. ప్రకాశం కలెక్టరేట్‌ కంట్రోల్ రూమ్ నంబర్ 1077. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవుల రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వారు కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement