ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ సీరియస్ అలర్ట్‌ని తెలియజేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని.. దీనివల్ల రాగల 24 గంటల్లో వాతావరణంలో తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. కాగా, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఒంటరి ప్రదేశాల్లో, చెట్ల కింద తలదాచుకోవద్దని సూచించారు.
పిడుగు హెచ్చరిక..
ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, నందిగామ, పెనుగ్రంచిప్రోలు, వీరుల్లపాడు ప్రాంతాల్లో,
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మర్రిపాడు మండలాల్లో.. వైఎస్సార్ జిల్లాలోని గోపవరం మండలం, దాని పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు.