Friday, November 22, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు- సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

రేపటి (బుధవారం) నుండి ఈనెల 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు కదిలే అవకాశం ఉందని, ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతం నుండి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రం మీద ఉన్న ఉపరితల ఆవర్తనంవరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement