అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్నఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ సముద్రం ప్రక్కనే ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి గుండా కొనసాగుతుంది. దాని ప్రభావంతో సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈనెల 7వ తేదీ ఉదయానికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండముగా మారే అవకాశం ఉంది. 8వ తేదీ ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతం ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ఆనుకుని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీగాను, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.