Saturday, November 23, 2024

రైతులను ముంచిన అల్ప పీడనం..

శ్రీకాకుళం, (ప్రభ న్యూస్‌) : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో మూడురోజులుగా కురిసిన వర్షాలు జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచినట్లయింది. ముఖ్యంగా మూడురోజుల క్రితం బాగా పండిన చేనును కోతలు కోసి పొలాల్లో పోగులుగా వేసిన రైతులు వర్షాల కారణంగా అవి నీట మునిగిపోవడంతో చేనును చూసి విలఫిస్తున్నారు. బుధ,గురు వారాల కంటే శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదం వరకూ విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో టెక్కలి డివిజన్‌తోపాటు, పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లలో కూడా పంటను కోసి పొలాల్లో పోగులు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నట్లయింది. శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవగా, టెక్కలి డివిజ న్‌లో మాత్రం భారీగా కురిసాయి. పలాస మండలంలో అత్య‌ధికంగా 14.4 సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, ఇచ్ఛాపురం, మందస మండలాలో 13సెం.మీలో, కంచిలిలో 12, కవిటిలో 13, సోంపేట 10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.

మిగిలిన మండలాల్లో కూడా 4 నుండి 8 శాతం వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 13 మండలాల్లో సగటున వర్షపాతం 5 సెం.మీలు నమోదవ్వగా, పాలకొండ డివిజన్‌లో 4సెం.మీల వర్షపాతం నమోదయ్యింది. ఈ సంవత్సరం ఖరీప్‌ మొదటి నుండి రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తూ వచ్చింది. ప్రారంభంలోనే వర్షాభావ ప్రభావంతో మెట్ట ప్రాంతాల్లోని అనేక మంది వరి పంట వేయలేదు. ఆ తరువాత కొంతమేర వర్షాలు కురవడంతో రైతులు ఎంతో ఆశగా కొన్ని మెట్ట ప్రాంతాల్లో ఖరీప్‌ పనులు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఆయకట్టు భూములపై కూడా కనిపించింది. అయితే మడ్డువలస, వంశధార, తోటపల్లి ప్రోజెక్టుల ద్వారా కొంతమేర సాగునీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు ఊపిరిపీల్చుకోగా, తరువాత వర్షాలు పడకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో నార్లు వేసిన రైతులు అవి ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.

ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం ఒకమాదిరిగా పంట పండింది. అయితే, అక్టోబర్‌ 26 నుండి 28వ తేదీ వరకూ మూడురోజుల వరకూ గులాబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలు, వంశదార, నాగావళికి వచ్చిన వరదలు, అదే విధంగా సువర్ణముఖి, వేగావతి నదులు ఉప్పొంగి ప్రవహించి వంశధారలో చేరడంతో జిల్లాలో వేలాది ఎకరాల వరి భూములు నీటమునిగాయి. భారీ గాలుల ప్రభావంతో అరటి, చెరకు, బొప్పాయి పంటలు ద్వంసమయ్యాయి. వరి తోపాటు, ఇతర పంటలు వేసిన రైతులు కొంతమేర నష్టపోగా, ఈ రెండుమాసాలుగా పంటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులు కొంతమంది ఈనెల 1వ తేదీ నుండే కోతలు ప్రారంభించగా, మరికొంతమంది మరో రెండు రోజుల్లో కోసేం దుకు సిద్దమవుతుండగా, ఆలశ్యంగా వేసిన రైతులు మరికొద్ది రోజుల్లో పంట కోసి పంట ఇంటికి తీసుకువెళదామని చూస్తున్న సమంలో అకాలవర్షాలు రైతులను నిట్టనిలువున ముంచాయి.

నీటిలో వరిచేను ఉండిపోయి, గింజరాలిపోవడాన్ని చూసిన రైతులు కంటతడిపెడుతున్నారు. రేగిడి, పాలకొండ, బూర్జ, పలాస, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల తదితర మండలాల్లో కోతలు కోసి ఉంచిన వరిచేను పూర్తిగా దెబ్బదినడం జరిగిందని ఇటు రైతులు, అటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. వరితోపాటు, ప త్తిపంట కూడా బాగా దెబ్బతిన్నట్లుగా పత్తి రైతులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ గాలులు వీచడం లేదని, లేకుంటే ఎన్ను విరిగి పూర్తిగా నీటమునిగేదని రైతులు వాపోతున్నారు. అయితే చీడపీడల కారణంగా ధాన్యం దెబ్బతింటుందన్న భయాన్ని కొందరు రైతులు వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మళ్లి సాయంత్రం చిన్నపాటి వర్షం కురుస్తుండడంతో రైతుల్లో మరింత ఆందోళన మొదలయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement