Thursday, November 21, 2024

తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు.. కృష్ణా జిల్లాలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సేంద్రియ సేద్యం

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మెట్టప్రాంతంలో నూతనంగా సాగుచేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు రైతులకు సత్ఫలితాలు ఇస్తుందని అమెరికా ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఎ.పి.టి.ఎ) కార్యదర్శి కేలం ధనలక్ష్మి అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో హనుమాన్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ ఫార్మ్‌ ఆధ్వర్యంలో సాగుచేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును ఆమె నేతృత్వంలోని రాష్ట్రంలోని 13జిల్లాల ప్రతినిధి బృందం పరిశీలించింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును పద్దతులను, మార్కెటింగ్‌ వివరాలను తెలుసుకుని బృందంలోని సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. అమెరికా ఎన్‌ఆర్‌ఐ ల భాగస్వామ్యంతో స్థాపించిన అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ గత 14 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు 3 కోట్ల రూపాయల స్కాలర్‌ షిప్‌ లు ఇవ్వటంతో పాటు- మన దేశం నుంచి అమెరికా కు వచ్చే విద్యార్ధినీ విద్యార్ధులకు వసతి, ఏ యూనివర్సిటీలో జాయిన్‌ అవ్వాలి.. ఏయే కోర్సులు ఎంచుకోవాలి..ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం శిక్షణ తదితర సేవలందిస్తున్నట్టు తెలిపారు.

దీనిలో భాగంగానే మొట్టమొదటి సారిగా రైతుల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో రైతు ఎక్కువ ఆదాయం పొందేలా సాంప్రదాయ పంటలకు భిన్నంగా వ్యవసాయంలో కొత్త పంటలు, ఆధునిక పద్ధతులు, మెళుకువలు తెలియచేసే ప్రయత్నంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అన్నే పద్మావతి ఆధ్వర్యంలో పూర్తి సేంద్రియ పద్దతిలో సాగుచేస్తున్న వివిధ పంటలతో పాటు బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని పూర్తి సేంద్రీయ పద్దతిలో సాగుచేస్తున్న హనుమాన్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ ఫార్మ్‌ ను సందర్శించి ఆధునిక పంట డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పరిశీలించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులకు లాభదాయకంగా ఉండే ఎన్‌. ఎం.కె వన్‌ గోల్డ్‌ రకం సీతాఫలం పంట సాగు పై రైతులకు అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాల్లో బిందు సేద్యం, తుంపర సేద్యం ద్వారా ఎలాంటి పంటలు సాగుచేసుకోవాలి.. పండించిన పంటను సొంతంగా మార్కెటింగ్‌ ఎలా చేసుకోవాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు.. అనంతరం నూతనంగా మార్కెట్‌ లోకి వచ్చిన స్వరాజ్‌ కంపెనీ వారి కోడ్‌ మినీ ట్రాక్టర్‌ పనితీరును పరిశీలించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం కేరళలోని కొబ్బరి రైతులతోనూ, పంజాబ్‌ లో వరి పండించే రైతులతోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement