Friday, November 22, 2024

బొగ్గు భారం.. తడిసి మోపెడు! రాష్ట్రంలో మూడు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గే ఆధారం

అమరావతి, ఆంధ్రప్రభ: ఓ పక్క బొగ్గు కొరత, మరోపక్క ధరలు, రవాణా ఛార్జీలు పెరిగిపోవడంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు ప్రధాన ఇంధనమైన బొగ్గును సమకూర్చుకోవడం అత్యంత క్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. రాష్ట్రంలోని మూడు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజువారీ అవసరాలకు సరిపడా కూడా బొగ్గు సమకూర్చుకోవడం చాలా భారమైపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని బొగ్గు గనులు తెలంగాణకు వెళ్లిపోవడంతో రాష్ట్రంలో ఒక్క బొగ్గు గని కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేశీయంగా ఉన్న ఇతర సంస్థల నుండి బొగ్గు లభ్యత కష్టంగా ఉండటం, రవాణాకు రైల్వే రాక్‌లు సరిపడా ఇవ్వకపోవడంతో కొనుగోలు ఖర్చులు, అక్కడి నుండి ఇక్కడికి తేవడానికి రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఈకారణంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు సరఫరాపై ఆంక్షలు విధించడం కూడా గోరు చుట్టపై రోకటి పోటులా తయారైంది. తప్పనిసరై బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్‌ కొనాల్సి వస్తోంది.

ఏటా రూ. 6,816 కోట్లు ఖర్చు..

రాష్ట్రంలో 5,010 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం గల రాయలసీమ థర్మల్‌ వపర్‌ ప్లాంట్‌ (ఆర్టీపీపీ), డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డా.ఎన్‌టీటీపీఎస్‌), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌) లలో విద్యుత్‌ ఉత్పత్తికి రోజుకు 60వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. ఈ బొగ్గును ఆంధ్రప్రదేశ్‌ పవన్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో), ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌)లు కొనుగోలు చేస్తాయి. దాని కోసం ఈ ఏడాది రూ. 6,816 కోట్లు ఖర్చు చేశాయి. రెండేళ్లలో బొగ్గు వ్యయం సగటున 14.84 శబుూతం పెరగడంతోగతేడాది కంటే రూ. 697.67 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది.

యుద్ధంతో పెరిగిన డిమాండ్‌..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆసియా, ఐరోపాలో బొగ్గు దిగుమతికి అవరోధం ఏర్పడింది. ఫలితంగా అక్కడి కొనుగోలుదారులు వేలంలో ఏ ధరకైనా కొని, భద్రపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరుగుతున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న కోల్‌ ఇండియా దాని ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తోంది. అధిక ప్రీమియంలు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్న బొగ్గుకంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన బొగ్గు చాలా చవక. కోల్‌ ఇండియా ద్వారా మార్చిలో జరిగిన వేలంలో కిలోగ్రాముకు 600 కిలో కేలరీల ఉష్ణ విలువ కలిగిన బొగ్గు టన్నుకు దాదాపు రూ. 11,700కు విక్రయించారు. అదే రోజున ఆస్ట్రేలియా మార్కెట్‌లో ఇదే రకమైన బొగ్గు ధరలో ఇది సగం కంటే తక్కువ. ఈకారణంగా విదేశఋ కొనుగోలదారులు వేలంలో పోటీపడి మన బొగ్గు కొనేస్తున్నారు. దీంతో రాష్ట్రం కూడా వాటితో పోటీ పడి ఎక్కువ ధర పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం కోల్‌ ఇండియా నుండి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయిస్తున్నారు. అదీ అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడి కొనాలి. సింగరేణి, మహానది కోల్‌ ఫీఈల్డ్స్‌ నుండి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవికి బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు 20 రేక్‌లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. అయినా 10 నుండి 12 రేక్‌లు మాత్రమే వస్తున్నాయి. గనులు మన రాష్ట్రానికి చాలా దూరంగా ఉండటంతో రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి చాలా కష్టంగా మారింది. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరలూ పెరిగాయి. సాధారణంగా రూ. 4 నుండి రూ. 5కు వచ్చే యూనిట్‌ విద్యుత్‌కు కనీసం రూ. 6 నుండి పీక్‌ అవర్స్‌లో రూ. 20 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా విద్యుత్‌ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. రెండేళ్లలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేస్తున్న బొగ్గు కొనుగోలు ధరలు, పెరుగుదల (వాటికి అవసరమయ్యే బొగ్గు నాణ్యతను అనుసరించి ఒక టన్నుకు రూపాయల్లో)

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement