(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు జోరుగా సాగింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా జిల్లాలో రెండో రోజు శుక్రవారం మొత్తం 18నామినేషన్లు దాఖలయ్యాయని ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.డిల్లీరావు శుక్రవారం తెలిపారు. మే 13న నిర్వహించనున్న పార్లమెంటు, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 18 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. ఇందులో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక సెట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పేరం శివనాగేశ్వరరావు రెండు సెట్లు, తెలుగు రాజాధికార సమితి పార్టీకి చెందిన బి.శ్రీనివాసరావు రెండు సెట్ల నామినేషన్లు సమర్పించడం జరిగిందన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని.. ఇందులో వైఎస్ఆర్ సీపీ నుంచి షేక్ ఆసిఫ్, సీపీఐ పార్టీకి చెందిన జి.కోటేశ్వరరావు, ఎంసీపీఐ (యూ)కి చెందిన ఖదీర్ భాషా షేక్, స్వతంత్ర అభ్యర్థిగా రత్నావత్ కిశోర్ కుమార్ ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారన్నారు.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని.. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా బొప్పన గాంధీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు, సీపీఎం (మార్క్సిస్ట్) అభ్యర్థిగా చిగురుపాటి బాబూరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా కె.శివశంకర్‌లు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మూడు నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గద్దె రామ్మోహన్, గద్దె అనూరాధ, గద్దె క్రాంతికుమార్‌లు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారనీ చెప్పారు.
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రెండు నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో స్వతంత్ర అభ్యర్థులుగా వేములపల్లి పృథ్వి, వేల్పూరి కనకదుర్గాదేవి ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రెండు నామినేషన్లను స్వీకరించడం జరిగిందని.. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కర్నాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజగోపాల శ్రీరామ్ (తాతయ్య)లు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.డిల్లీరావు ప్రకటనలో వివరించారు.