Wednesday, November 20, 2024

బీఆర్‌ఎస్‌లోకి జోరుగా చేరికలు.. ఏపీ నుంచి పలువురు ముఖ్యనేతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలువురు ముఖ్యులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. ఏపీకి చెందిన మాజీ మంత్రులు మొదలు పలు ఎన్నికల్లో పోటీ చేసిన పలుపార్టీలకు చెందిన ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరుతున్నారు. అసెంబ్లి గతంలో ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు తామ పనిచేసిన పార్టీల్లో వీరికి అనుభవం కూడా ఉంది. అయితే పలు కారణాల వల్ల కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ముఖ్యనేతలు పలువురు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ లో చేరేందుకు మొగ్గు చూపుతుండడంతో ఈ చేరికలకు ప్రాధాన్యత ఏర్పడింది.

గతంలో ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి పదవీ విరమణ చేసిన పలువురు నేతలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఏపీలోని పలువురు ముఖ్యులు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. సోమవారం ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అదేవిధంగా ఏపీకి చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, జనసేన నేత చింతల పార్థసారథి బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అదేవిధంగా మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో చేరనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 2019 ఏపీ సాధారణ అసెంబ్లి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా చంద్రశేఖర్‌ పోటీ చేశారు. కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ, వైసీపీలోనూ క్రియాశీలకంగా పనిచేశారు.

తెలంగాణ వ్యాప్తంగానూ మంత్రుల సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మహబూబ్‌నగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ , రంగారెడ్డి జిల్లాల్లోని పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు.
కాగా.. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ ఐఆర్‌ఎస్‌ పార్థసారథి, మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థి, యువజన జాయింట్‌యాక్షన్‌ కమిటీ స్వాగతించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంలో దండుగా కలవడం ఖాయమని కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ అన్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ జెండా రెపరెప లాడుతుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఏపీ నేతలు కొత్త రాజకీయ చరిత్రకు నాందిపలకనున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement