Sunday, November 24, 2024

AP: ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ..

జిల్లా ఎస్పీ వి.రత్న ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ.. హాజరైన పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్య సాయి జిల్లా మద్యం దుకాణాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియ సోమవారం జిల్లా కేంద్రంలోని సాయి ఆరామంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మద్యం దుకాణాల కేటాయింపున‌కు సంబంధించి నిర్వహిస్తున్న లాటరీ సందర్భంగా జిల్లా ఎస్పీ వి.రత్న ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పట్టణంలోని ట్రాఫిక్ సైతం దారి మళ్ళించారు. కార్యక్రమానికి డీఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఎస్.ఈ గోవింద నాయక్ ఇతర అధికారులు హాజరయ్యారు. మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా ఎంపిక చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించి మొత్తం 27 మద్యం దుకాణాలు ఉండగా వీటికి జిల్లా వ్యాప్తంగా 1460 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పుట్టపర్తి రూరల్ పరిధిలోని మద్యం దుకాణానికి 47 దరఖాస్తులు వచ్చాయి.

అత్యల్పంగా హిందూపురం రూరల్ పరిధిలోని మద్యం దుకాణానికి ఆరు దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు తీసే లక్కీ డ్రా అనంతరం మద్యం దుకాణాలను సంబంధిత లాటరీ విజేతలకు కేటాయిస్తారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణం దక్కించుకున్న వారు కట్టిన దరఖాస్తు ధర రెండు లక్షలను డిపాజిట్ కింద తీసుకొని, తక్కిన డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలను ప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

- Advertisement -

విశాఖ‌ప‌ట్నంలో…

సోమవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రారంభ‌మైంది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎక్సైజ్ శాఖ గజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తున్నారు. మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు మ‌ద్యం దుకాణాల‌కు డ్రా లు తీస్తున్నారు. విశాఖ జిల్లాలో 155 దుకాణాలకు గాను 4139 అప్లికేషన్స్ వ‌చ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement