రెండేళ్లు దుమ్ముదులిపే అమ్మకాలతో భారీగా ఆర్జించొచ్చని పోటీపడ్డారు. మద్యం దుకాణాలకు ఏపీ సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో వ్యాపారులు కోట్లు కుమ్మరించారు. ఏపీనుంచి వచ్చే మందుబాబులతో కోట్లు వస్తాయని ఆశపడ్డారు. ఇక్కడి మద్యం దొడ్డిదారిన ఏపీకి తరలించే అవకాశాలు, ఆశలు, అంచనాలు ఆవిరయ్యాయి. ఏపీలో మొన్నటివరకు మద్యం ధరలు భారీగా ఉండటం, అన్ని బ్రాండ్లకు చెందిన మద్యం దొరకక కిక్కు తక్కువైన ఏపీ మందు ప్రియులు కార్లు, వాహనాలు, ఇతర మార్గాల్లో తెలంగాణ సరిహద్దులోని మద్యం దుకాణాలకు వచ్చి తాగి సేదతీరేవారు. ఇక్కడి మద్యాన్ని పలు మార్గాల్లో ఏపీకి తరలించి భారీగా సొమ్ముచేసుకునే పద్దతి ఉండేది. దీంతో తెలంగాణ సరి హద్దులోని జిల్లాల్లో మద్యం దుకాణాలకు తీవ్ర పోటీ ఉండేది. రెండేళ్లలో కోట్లు వెనకేసుకోవచ్చనే ఆశతో పలు వురు నూతనంగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. కొత్త వారికి టెండర్లలో దుకాణాలు రావడంతో సిండికేట్లు రంగంలోకి దిగి కోట్లల్లో గుడ్‌విల్ ఇస్తామని ఆశ పెట్టినా నూతనంగా దుకాణాలు దక్కించుకున్న ఔత్సాహికులు ససేమిరా అన్నారు. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ తీసు కున్న నిర్ణయంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఏపీ లో ధరలను భారీగా తగ్గిస్తూ ఎక్సైజ్‌శాఖ తాజాగా నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇక్కడికి వచ్చి తాగేవాళ్లు కరువ య్యారు. బెల్టు షాపులకు లిక్కర్ సేల్స్ తరలింపు ఆగిపోయింది. పైగా ఏపీనుంచి ఇక్కడికివచ్చి మద్యం దొంగరవాణా చేసే ముఠాలు ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి.
దీంతో ఎమ్మార్పీ కంటే రూ. 10, రూ. 20 ఎక్కువ ధరలకు విక్రయించే తెలంగాణ వైన్ షాపులు ఇప్పుడు ఎమ్మార్పీ ధరలకు అమ్ముదామన్నా కొనేందుకు మందుబాబులు ముందుకు రావడంలేదు. అంతేకాకుండా ఏపీలో తెలంగాణ రేట్లకంటే తక్కువకే మద్యం దొరకుతుండటంతో ఏపీనుంచి సరిహద్దు తెలంగాణ గ్రామాలకు మద్యం వస్తోందని తెలుస్తోంది. తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసిన 15 రోజులకు ఏపీలో ప్రభుత్వం పన్నులను తగ్గించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై బ్రాండులననుసరించి 5నుంచి 12శాతం వరకు తగ్గించగా, అన్ని కేటగిరీల మద్యంపై 20శాతం ధరలను తగ్గించారు. లిక్కర్ అక్రమ రవానా, నాటుసారా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీంతో బ్రాండులనుబట్టి క్వార్టర్‌పై రూ. 10నుంచి రూ. 30వరకు ఫుల్ బాటిల్‌పై రూ. 100నుంచి రూ. 150కి తగ్గిపోయాయి. బీర్‌పై కూడా ధరలు తగ్గి తెలంగాణకంటే తక్కువగా దొరుకు తున్నాయి. దీంతో మద్యం విక్రయాలు సరిహద్దు జిల్లాల్లో పడిపోయాయి.
న్యూఇయర్, సంక్రాంతి, ఎన్నికలు ఇలా అనేక అంచనాలతో మద్యం దుకాణాలకు పోటీపడిన తెలంగాణ వ్యాపారులు ఏపీ నిర్ణయంతో బావురుమంటున్నారు. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ భారీగా విక్రయాలు సాకారమవుతాయని అంచనా వేసుకున్న వ్యాపారులు ఏపీ ప్రభుత్వ ధరల తగ్గింపు నిర్ణయం తర్వాత స్టాకును తగ్గించారు. ఇప్పుడు వీకెండ్, పండుగలు, సీజన్ అంటూ ఏదీలేకుండా సరిహద్దు లిక్కర్ షాపులు తాగేటోళ్లు లేక వెలవెలబోతున్నాయి. గతంలో టెంట్లు వేసుకుని మరీ షాపులు నడిపిన వ్యాపారులు ఇప్పడు మందు బాబులకోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 1నుంచి తెలంగాణలో మద్యం పాలసీ ప్రారంభంకాగా, టెండర్లకు చివరిరోజు 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2620 మద్యం దుకాణాలకు 67849 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ దఫా ఏపీనుంచి ఎక్కువగా వ్యాపారులు టెండర్లు దాఖలు చేశారు. ఏపీలో ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడి వ్యాపారులకు పనిలేకుండా పోయిందని, తెలంగాణలో తక్కువ ధరలకు మద్యం అందుబాటులో ఉందనే కారణంతోపాటు, తెలంగాణలో అత్యధిక మార్జిన్, ఏపీ సరిహద్దు జిల్లాల్లో మందు బాబులు తెలంగాణలోని మద్యం దుకాణాల్లో కొనుగోలు చేయడం వంటి చర్యల కారణంగా వ్యాపారులు క్యూ కట్టారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలకు అత్యధికంగా దరఖాస్తులు రావడం వెనుక ఇదే ప్రధాన కారణమని అధికారులు అంచాన వేశారు.
ఏపీ సరిహద్దులోని నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, ఎర్రుపాలెం వంటి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో, అదేవిధంగా కర్నూలుకు సమీపంలోని అలంపూర్‌లోనూ అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. గుంటూరుకు సమీపంలోని తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో గతంలో మూడు వైన్ షాపులు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో దుకాణానికి ఏపీ బార్డర్లోని వల్లభి గ్రామంలో అనుమతించారు. ఈ దుకాణానికి 118 దరఖాస్తులు వచ్చాయి. ఈ దఫా బెల్టు షాపుల యాజమాన్యాలు ఎక్కువగా దరఖాస్తులు వేయగా, 10నుంచి 15మంది సిండికేట్‌గా ఏర్పడి అప్లికేషన్లు సమర్పించారు. ఆశ్వారావుపేట, సూర్యా పేట జిల్లాలోని బార్డర్ గ్రామాలు, కోదాడ మండలంలోని పలు సరిహద్దు షాపు లకు, నల్గొండ జిల్లాలోనూ, నాగర్ కర్నూలులోనూ ఏపీ వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తులు సమర్పించారు. ఎంతో ఆశతో పోటీపడిమరీ దుకాణాలు దక్కిం చుకున్న వ్యాపారుల అంచనాలు తలకిందులయ్యాయి. తామొకటి తలిస్తే దైవ మొకటి తలచిందన్నట్లుగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బార్డర్ దుకాణాలకు శాపంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ సర్కార్ దృష్టికి తీసుకొచ్చి ఏపీ మద్యం తెలంగాణలోకి రాకుండా నిఘా పెట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital