కొయ్యలగూడెం, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : కొయ్యలగూడెం మండలంలోని జంగారెడ్డిగూడెం వెళ్ళే ఎన్.హెచ్ 516-డీ జాతీయ రహదారి పులివాగు వంతెనపై ఇవాళ తెల్లవారుజామున లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న తహశీల్దార్ నాగమణి వెను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 24 మందికి గాయాలయ్యాయని తహశీల్దార్ నాగమణి తెలిపారు. ఈమేరకు ఆమె తెలిపిన వివరాల ప్రకారం… జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాడపల్లి వెళ్తుండగా జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి.
ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణీకులను రెండు 108 వాహనాల్లో కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణమే ప్రాథమిక వైద్యం అందించారని అన్నారు. 14 మంది ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. గాయపడ్డ వారిలో ఒక హృద్రోగ వ్యక్తి, ఒక బాలింత ఉండగా వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం పంపినట్లు తెలిపారు. అదేవిధంగా మూడు నెలల చిన్నారిని వారి కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. మిగిలిన 7 మందికి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని తహశీల్దార్ వెల్లడించారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ఆసుపత్రుల్లో వైద్య సేవలను తహశీల్దార్ తన సిబ్బందితో దగ్గరుండి పర్యవేక్షించారు.