Friday, November 22, 2024

విద్యుత్ చార్జీల పేరుతో కోట్లు కొల్లగొట్టారు.. నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో రూ. 7620 కోట్ల కేంద్ర నిధులను వాడుకుందని అఖిల భారత పంచాయతీ పరిషత్ ఆరోపించింది. 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్‌ను సోమవారం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ కొత్తపు మునిరెడ్డి ఢిల్లీలోని కృషి భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు.

2018 -2019వ సంవత్సరానికి రూ. 1729.23 కోట్లు, 2019-20 కి 2336.56 కోట్లు, 2020- 21 సంవత్సరానికి రూ.2600 కోట్లు, 2021-22కి విడతల వారీగా రూ. 969.50 కోట్లు, రూ. 3590.5 కోట్లు మొత్తం కలిపి రూ. 7665 . 29 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు. కానీ కేంద్ర 14, 15వ ఆర్థిక సంఘం నిబంధనలను తుంగలో తొక్కి సర్పంచ్, గ్రామ సభ తీర్మానం లేకుండానే నిధులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిల పేరుతో స్వాధీనం చేసుకుందని వారు సునీల్‌ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర నిబంధనలకు ఖర్చు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గ్రామ పంచాయతీలకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రాలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, నిధులను గ్రామ పంచాతీయలకు తిరిగి చెల్లించాలని, కేంద్ర నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ హామీ ఇచ్చినట్టు జాస్తి రామాంజనేయులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement