అమరావతి – వేయని రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఒక్క జగన్ కే సాధ్యమని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.. ఈ కేసులో ఆయనను ఎ 14 గా చేర్చడంపై స్పందిస్తూ యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగిందని చెప్పారు.
మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు. రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వరకు నడిపిస్తుందని అన్నారు.