తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రచారం చేయనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు.
తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమవుతారు. ఇందులో భాగంగా తాజాగా రెండురోజుల టూర్‌లో భాగంగా నారా లోకేష్ తమిళనాడు వెళ్తున్నారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్తున్నారు నారా లోకేష్. రెండురోజుల పాటు యువనేత అక్కడే మకాం వేయనున్నారు. దక్షిణ తమిళనాడులో తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన చాలామంది ప్రజలు అక్కడ స్థిరపడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. బీజేపీ హైకమాండ్ ద్వారా పురందేశ్వరికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ అక్కడ ప్రచారానికి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. తక్కువ సమయంలో తమిళనాడులో ఫేమస్ అయ్యారు అన్నామలై. ఆయనకు లోకేష్ జత కలిస్తే తిరుగుందనేది కమలనాథులు భావిస్తున్నారు.
మరోవైపు టీడీపీ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ యువనేత నారాలోకేష్. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఓటర్లు టీడీపీ, బీజేపీ, జనసేన వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. 175 అసెంబ్లీకు గాను 150 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే 23 ఎంపీ సీట్లలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని చెప్పుకొచ్చారు.