Friday, November 22, 2024

Crime | తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌.. నాలుగు జిల్లాల్లో దోపిడీలు చేస్తున్న ఇద్ద‌రు అరెస్టు

ముత్తుకూరు (ప్రభ న్యూస్): తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్‌. ఇళ్లకు తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లారో.. మీరు వ‌చ్చేసరికి ఇళ్లు గుల్ల కావాల్సిందే. వారి క‌న్ను ప‌డిందంటే చాలు.. ఎంత‌టి తాళ‌మైనా ఇట్టే ఊడిపోతుంది. ఇట్లా నాలుగు జిల్లాల్లో అప్ర‌తిహాతంగా దోపిడీల‌కు తెగ‌బ‌డుతున్న దొంగ‌ల‌ను ముత్తుకూరు పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు.

నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో దొంగతనాలు చేస్తున్న అంత‌ర్‌జిల్లా దొంగ‌లను ముత్తుకూరు పోలీసులు పట్టుకున్నారు. ఇందులో సునీల్‌పై ఇప్ప‌టికే 45 కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం రూర‌ల్ డీఎస్పి వీరాంజనేయరెడ్డి మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. నెల్లూరు సిటీకి చెందిన పాత నేరస్థుడు సునీల్ అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. దేవరపల్లి సురేష్ అనే మ‌రో దొంగతో పరిచయం పెంచుకొని మ‌ళ్లీ చోరీలు, దోపిడీలు చేయడం ప్రారంభించారు.

ముత్తుకూరు మండలంలో కూడా పలు ప్రాంతాల్లో ఇద్దరు కలిసి దొంగతనాలు చేశారు. తాళం వేసి ఉన్న ఇండ్ల‌ను టార్గెట్ చేసి దూరిపోవ‌డం, బంగారు, వెండి నగలు దోచేసి చెడు వ్యసనాలకు ఖర్చు పెట్ట‌డం అల‌వాటుగా చేసుకున్నారు. ఈ దొంగలను మల్లూరు సెంటర్ వద్ద ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు. వీరి నుంచి సుమారు 15 లక్షల రూపాయలు విలువచేసే బంగారం నగలు, రెండు కేజీలు వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 2011 నుంచి పాత నేరస్థుడు దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడని తెలిపారు. వారిని పట్టుకోవడంలో చొర‌వ‌చూపిన‌ కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, శివ కృష్ణారెడ్డి ని డీఎస్పీ ప్రశంసించినారు. వారికి రివార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement