Monday, November 25, 2024

AP: టీచ‌ర్ల‌ను నియ‌మించ‌క‌పోతే స్కూళ్ల‌కు తాళాలు వేయండి… ఎమ్మెల్యే దూలం

(ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా) : టీచర్లను నియమించకపోతే స్కూళ్లకు తాళాలు వేయండని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా నుండి విడిపోయిన తర్వాత కైకలూరు నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు.


ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీల అనంతరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలు, మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీపై పట్నాలకు వెళ్లడంతో, ఇక్కడ పని చేసేందుకు ఉపాధ్యాయులెవ‌రూ ముందుకు రాకపోవడంతో ఆయా పాఠశాలలో ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. నియోజకవర్గం మొత్తం 200కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు నియమించకుండా, ఇక్కడ పనిచేస్తున్న వారిని ఏ విధంగా రిలీవ్ చేస్తారు అంటూ అధికారులను నిలదీశారు.

ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. 40 రోజుల క్రితం ఏలూరులో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించానని, అయినా నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు. ఉపాధ్యాయులను నియమించకపోతే లంకలు, మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు తాళాలు వేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించడం మీ వళ్ళ కాదంటే సీఎం కాళ్ల మీద‌ పడి తన నియోజకవర్గంలోని లంక గ్రామాలు, మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల విషయాన్ని మొరపెట్టుకుంటానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యార్థులు చదువు ఏం చేయాలో ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement