Hon’ble Prime Minister of India Sri. Narendra Modi Participates in “ROAD SHOW” at Visakhapatnam
విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షో లో విశాఖవాసులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒక రోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా నుంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు.
ఈ క్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఈ రోడ్ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ.. అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన విశాఖ రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు..అలాగే సాయంత్రం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు
భారీ బహిరంగ సభ ..
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగసభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. ఈ పర్యటనలో 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని.. ఎన్టీపిసి, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. సభకు భారీ ఏర్పాట్లు చేశారు కూటమి పార్టీలు.. ఇక, ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. ప్రధాని బహిరంగ సభ వేదికపై 13 మందికే అవకాశం కల్పించనున్నారు.. ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పార్టీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఛాన్స్ అవకాశం ఇచ్చారు…
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్,వంగలపూడి అనిత, నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై ఆసీనుకానున్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించేవి ఏమిటంటే..
విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ డబ్లింగ్ వంటి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇంకా 16వ నంబర్ హైవేలో చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ రోడ్డును జాతికి అంకితం చేస్తారు. ఇంకా నేషనల్ హైవేలు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.