ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేశారు. తొలిరోజు ఉదయం 9.26 గంటల కు సభ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది.. నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ప్రొటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య సభను ప్రారంభించారు.
. తొలిరోజు అంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికే కేటాయించారు. సభలో మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ తర్వాత మంత్రులు చేస్తారు. ఆ పిమ్మట మహిళా ఎమ్మెల్యేలతో చేయిస్తారు. వారి తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం జరుగుతుంది.
175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి సభను ముగిస్తారు. తొలిరోజే స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు స్వీకరిస్తారు. రెండోరోజు సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ సంఖ్యాబలం ఉండటం వల్ల స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశం ఉంది.
సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడును స్పీకర్‌గా ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. స్పీకర్‌గా ఆయన ఎన్నికను ప్రకటించిన తర్వాత సభలో సీఎం, ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరగా స్పీకర్ వారికి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడతారు. దీనితో రెండోరోజు సభ ముగుస్తుంది. రెండోరోజు కేవలం స్పీకర్ ఎన్నిక కోసం మాత్రమే సభను సమావేశపరుస్తున్నారు. దీని తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.
ఈ సమావేశాల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల పాస్‌లు పూర్తిగా నిలిపివేశారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా రావద్దని అసెంబ్లీ అధికారులు సమాచారం పంపారు. సభలో సందర్శకుల గ్యాలరీలో కేవలం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొంత భాగం మీడియాకు సర్దుబాటు చేశారు. మరికొన్ని సీట్లు ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు రిజర్వు చేశారు. స్థలం పరిమితంగా ఉండటంతో తమ వెంట ఎవరినీ తేవద్దని ఎమ్మెల్యేలను కోరారు.