అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ గడువును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఇప్పుడున్న 2934 షాపులను యధావిధిగా కొనసాగిస్తూ లైసెన్స్‌లు మంజూరు చేశారు. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా ఏపీబీసీఎల్ నిర్వహిస్తున్న మద్యం షాపుల లైసెన్స్ గడువును ప్రభుత్వం ఏటా జారీ చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారంతో ఏడాదికి జారీ చేసిన లైసెన్స్ కాల పరిమితి ముగిసింది. మరో ఏడాది పాటు 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మద్యం షాపుల లైసెన్స్‌లను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం షాపుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్ పేమెంట్లకు అవకాశం కలిపించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం పాలసీని దృష్టిలో ఉంచుకొని రిటైల్ ఔటులెట్స్ సంఖ్య పెరగడకుండా వాక్ ఇన్ స్టోర్స్(ఎలైట్ షాపులు) ఏర్పాటుకు ఏపీబీసీఎల్‌కు అధికారం ఇచ్చారు.
పర్యాటక ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటు తదితర అంశాలను ఏపీబీసీఎల్ అధికారులతో సమన్వయం చేసుకొని నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కొత్త మద్యం, బార్ పాలసీలను తీసుకొచ్చింది. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపుల నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్)కు అప్పగించింది. రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 4384 షాపుల సంఖ్యను 33శాతం మేర తగ్గిస్తూ 2019-20లో 2934కు కుదించింది. అప్పటికే ఉన్న బెల్టు షాపులు, పర్మిట్ రూములను రద్దు చేస్తూ గత రెండేళ్లుగా షాపుల లైసెన్స్‌లను రెన్యువల్ చేస్తోంది. ఈ క్రమంలోనే గడువు ముగియడంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇక్కడ అనుమతులు లేవు..
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో మద్యం షాపుల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండ్ మీదుగా వెళ్లే రోడ్డు, లీలామహాల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లీలామహాల్ నుంచి నందిసర్కిల్, అలిపిరి, ఎస్వీఆర్ ఆసుపత్రి, స్విమ్స్ వరకు ఉన్న రోడ్డులో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది.