Friday, November 22, 2024

బ్రాండ్ జోరు..త‌గ్గిన బీరు..

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగుతున్నాయి. ప్రభుత్వం రెగ్యులర్‌ బ్రాండ్లను అందుబాటులోకి తేవడంతో మద్యం అమ్మకాలు పెరగగా.. బీర్ల అమ్మకాలు కొంత వరకు తగ్గాయి. అమ్మకాలు పెరిగినప్పటికీ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయం స్వల్పంగా మాత్రమే పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్‌ 31న మద్యంపై అన్ని రకాల పన్నులు సవరించడంతో రేట్లు తగ్గాయి. ఇదే సమయంలో ప్రీమియం, మీడియం రకాల పాత బ్రాండ్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 2021తో పోల్చితే 4లక్షల 32వేల 112 మద్యం కేసులు అదనంగా అమ్ముడు పోగా.. బీర్లు గత ఏడాదితో పోల్చితే 56వేల 839 కేసుల అమ్మకాలు తగ్గాయి. ఆదాయపరంగా చూస్తే రూ.5.40 కోట్లు పెరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అమలులోకి తెచ్చింది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీబీసీఎల్‌కు అప్పగించింది. మద్యం అమ్మకపు వేళలను భారీగా తగ్గించడంతో పాటు రేట్లు కూడా అనూహ్యంగా ప్రభుత్వం పెంచింది. రేట్ల పెరుగుదల సహా ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలను ఐదేళ్లలో అమలు చేయనున్న సంపూర్ణ మద్య నిషేధంలో భాగమని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో ఏళ్ల తరబడి మద్యం షాపులు, బార్లలో దొరికే బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను దించింది. ఓ వైపు రేట్లు పెరిగినప్పటికీ సరైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఇంటిలిజెన్స్‌, సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఇచ్చిన పలు నివేదికల ఆధారంగా ప్రభుత్వం రేట్లు తగ్గించేందుకు పన్నుల సవరణ చేసింది. ఇదే సమయంలో రెగ్యులర్‌ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చి అక్రమ మద్యం అమ్మకాలు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు.

గతంలో భారీగా ఎన్‌డీపీ రాక..

రాష్ట్రంలో రేట్ల వ్యత్యాసంతో పాటు రెగ్యులర్‌ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో స్మగ్లింగ్‌ భారీగా పెరిగింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎన్‌డీపీ(సుంకం చెల్లించని) మద్యం ఏరులై పారింది. ఆదాయ పరంగా చూస్తే కొత్త మద్యం పాలసీ అమలుకు ముందున్న దానితో పోల్చినప్పుడు పెద్దగా వ్యత్యాసం లేదు. రేట్ల పెరుగుదల వలనే ఆదాయం వస్తున్న ప్పటికీ.. ఏపీకి రావాల్సిన ఆదాయం పొరుగు రాష్ట్రాలకు పోతోంది. ప్రభుత్వం అక్రమ మద్యం రాకను అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను బలోపేతం చేసింది. సెబ్‌ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ మద్యం రాక ఆగలేదు. కొత్త మద్యం పాలసీకి ముందు రెండేళ్ల కాలంలో 10వేల అక్రమ మద్యం అమ్మకపు కేసులు నమోదు చేస్తే తదనంతరం 28వేల కేసులకు పైగా అధికారులు నమోదు చేశారు. అయినప్పటికీ స్మగ్లర్లు మద్యం అక్రమ రవాణాను ఆపలేదు. సెబ్‌, పోలీసుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించి సొమ్ము చేసుకున్నారు. మద్యం స్మగ్లింగ్‌లో వ్యవస్థీకృత ముఠాల ఆగ డాలు పెరగడం..గ్రామీణ ప్రాం తాల్లో నాటు సారా బట్టీలు వెలుస్తుండటంతో పునరాలోచన చేసిన ప్రభుత్వం రేట్లు తగ్గించడంతో పాటు బ్రాండెడ్‌ మద్యం అందుబాటులోకి తెచ్చింది.

పెరిగిన అమ్మకాలు..

ప్రభుత్వ నిర్ణయంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. గత జనవరిలో 27లక్షల 33వేల 419 మద్యం కేసులు అమ్ముడుబోగా, ఇదే జనవరి 2021లో 23లక్షల ఒక వెయ్యి 307 కేసుల అమ్మకం జరిగింది. గత ఏడాదితో పోల్చినప్పుడు 4లక్షల 32వేల 112 కేసుల మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో ఈ ఏడాది జనవరిలో బీర్లు ఆరు లక్షల 87వేల 540 కేసులు అమ్ముడుపోగా, గత ఏడాది ఏడు లక్షల 44వేల 379 కేసులు అమ్ముడయ్యాయి. బీర్ల అమ్మకాలు తగ్గడానికి మద్యం రేట్లు తగ్గడమే కారణమని చెపుతున్నారు. మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు తక్కువ రేటు కావడంతో బీర్లపై ఆసక్తి చూపారు. ఎప్పుడైతే మద్యం రేట్లు తగ్గాయో అప్పటి నుంచి బీర్లు తగ్గాయి. ఆదాయం విషయానికి వస్తే ఈ ఏడాది జనవరిలో మద్యం, బీర్ల అమ్మకాలపై రూ.2247.93 కోట్లు రాగా గత ఏడాది 2242.53 కోట్లు వచ్చింది.

- Advertisement -

రేట్లు తగ్గడం, బ్రాండ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కోవిడ్‌ కూడా కారణమని చెపుతున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్‌-19 పరిస్థితుల నేపధ్యంలో వివిధ వ్యాపారాలు, ఉపాధి మార్గాలు దెబ్బతినడం మద్యం అమ్మ కాలపై ప్రభావం పెరిగింది. రానున్న రోజుల్లో అమ్మకాలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement