Saturday, November 23, 2024

ఏపీలో ఆరు కొత్త ఆర్వోబీలకు లైన్‌ క్లియర్‌.. 724 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీ (ఆర్వోబీ)ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి వరుస ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్‌ ప్రమాదాలు పూర్తిగా నియంత్రించడంతో పాటు ఆమార్గంలో ప్రయాణించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓవర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రహదారులు, భవనాల శాఖ కేంద్ర ఉపరితల జాతీయ రహదారుల అభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఇతర నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి ప్రతిపాదనలను పంపింది. సేతు భారతం ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఇప్పటికే ఈ ఆరు ఆర్వోబీల నిర్మాణానికి సంబంధించిన నివేదికలను నిర్మాణానికి అయ్యే వ్యయం అంచనాలను కూడా రహదారుల, భవనాల శాఖ పూర్తి చేసింది.

వీటి నిర్మాణానికి రూ. 724 కోట్లు వ్యయం అవుతాయని అంచనాలను రూపొందించింది. ఈ అంచనా వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో భూ సేకరణ, టెండర్‌ ప్రక్రియపై రహదారులు, భవనాల శాఖ దృష్టి సారించింది. విజయవాడ – భీమవరం సెక్షన్లలో గుడివాడ సమీపంలో రూ. 110 కోట్లతో 4.7 కిలోమీటర్ల మేర ఆర్వోబీని నిర్మించనున్నారు. అలాగే కైకలూరు సమీపంలో రూ. 110 కోట్లతో 1.3 కిలోమీటర్ల మేర, రూ. 65 కోట్లతో 1.5 కిలోమీటర్ల మేర భీమవరం – నర్సాపురం సెక్షన్లలో పెన్నాడ అగ్రహారం శృంగవృక్షం రైల్వే స్టేషన్ల మధ్య రూ. 150 కోట్లతో 1.5 కిలోమీటర్లు, భీమవరం – ఉండి రైల్వే స్టేషన్ల మధ్య రూ. 200 కోట్లతో 1.90 కిలోమీటర్లు అలాగే మదనప ల్లి సమీపంలో రూ. 74 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం ఆరు ఆర్వోబీలను నిర్మించేందుకు రహదారులు భవనాల శాఖ ప్రతిపాదనలు చేయగా వీటన్నింటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదముద్ర వేశాయి. తాజాగా ఈ అనుమతులు మంజూరు కావడంతో రహదారులు, భవనాల శాఖ ఆర్వోబీల నిర్మాణంపై దృష్టి సారించింది. త్వరలోనే టెండర్‌ ప్రక్రియను ప్రారంభించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భూసేకరణను కూడా చేపట్టనుంది. తొలుత భూసేకరణను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణను ప్రారంభించింది.

ఈ ప్రక్రియ రెండు నుంచి మూడు నెలల్లోగా పూర్తి చేసి ఆర్వోబీల నిర్మాణానికి టెండర్లను పిలవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఆర్వోబీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. మొత్తం ఈ ఆరు ఆర్వోబీలను రెండు వరుసల రహదారులు ఉండేలా ప్రణాళికలను రోడ్లు, భవనాల శాఖ రూపొందించింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 22 ఆర్వోబీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో రెండు ఆర్వోబీల నిర్మాణం తుది దశకు చేరుకోగా మిగిలిన వాటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆర్వోబీల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించి వేగంగా పూర్తి చేసేందుకు రహదారులు, భవనాల శాఖ ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement