ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రిగా జనసేన నేత, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సినిమా రంగంపై స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీపై పలు రకాల ఆంక్షలు ఉండేవనే విమర్శలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ప్రధానంగా బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరలు విషయంలో వైఎస్ జగన్ సర్కార్ కాస్త కఠినంగా ఉండేదనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపించేవి. టిక్కెట్ ధరలు పెంచుకోనివ్వడం లేదని పలువురు వాపోయేవారు. అయితే ఇకపై అలాంటి ఆంక్షలు ఏమీ ఉండవని అంటున్నారు కందుల దుర్గేష్. ఇకపై సినిమా ఇండస్ట్రీపై ఎటువంటి ఆంక్షలూ ఉండవని స్పష్టం చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఇదే సమయంలో సినిమా రంగం అభివృద్ధికి కృషి చేస్తామని.. ఆ రంగానికి లబ్ధి చేకూరుస్తామని ఆయన ప్రకటించారు.