అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బార్ లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్త బార్ పాలసీలో భాగంగా 2022-25కు తగిన ఆప్‌సెట్ ప్రైజ్ రాకపోవడంతో పదహారు బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయలేదు. ఇందులో గ్రేటర్ విశాఖలో రెండు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఒకటి, కృష్ణాజిల్లాలోని తాడిగడప, పెడన మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, ఎన్‌టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, గుంటూరు జిల్లాలోని తెనాలి మున్సిపాలిటీలో నాలుగు, పొన్నూరు మున్సిపాలిటీలో రెండు, బాపట్ల జిల్లాలో చీరాల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల జిల్లాలోని నంద్యాల మున్సిపాలిటీ, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పు బార్ల లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ వేలం, ఆన్ లైన్ లాటరీ విధానంలో బార్ల కేటాయించనున్నారు. ఈ నెల 28న మద్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లాటరీ విధానంలో కేటాయించేందుకు ఎక్సైజు కమిషనర్ వివేక్ యాదవ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు మద్యం అమ్ముకునేలా 2023-25 గెజిట్ జారీ చేశారు. 50 వేల లోపు జనాభా ఉన్న పంచాయితీలు, నగర పంచాయితీల్లో దరఖాస్తు ఫీజుగా రూ.ఐదు లక్షలు, 50వేల పైన, ఐదు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.50లక్షలు, ఐదు లక్షలు పైబడిన ప్రాంతాల్లో రూ.10లక్షలుగా దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఇది తిరిగి చెల్లించరని గెజిట్‌లో స్పష్టం చేశారు.