దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ ఎగుమతుల్లోనూ వ్యవసాయోత్పత్తులతో పోటీ పడుతున్న ఉద్యాన పంటల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాసిరకం విత్తనాలు, మొక్కల కారణంగా వందల కోట్ల విలువైన పంటలు పాడైపోతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఉద్యాన నర్సరీస్ రిజిస్ట్రేష్రన్ యాక్టు-2010లో సవరణలు చేస్తూ తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. చట్టంలో తాజాగా తీసుకొచ్చిన సవరణల ప్రకారం నర్సరీలను ఇష్టారీతిన ఏర్పాటు చేయటానికి వీలులేదు. ఇపుడు రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తన్న నర్సరీలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసే నర్సరీలకు సైతం తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలి. నర్సరీలతో పాటు వాటికి అనుబంధంగా నడిచే షెడ్ నెట్, పాలీ హౌస్‌లకు సైతం లైసెన్సులు ఉండాలి. రాష్ట్రంలో సుమారు వెయ్యి పండ్ల మొక్కల నర్సరీలుండగా కూరగాయల విత్తనాలను ఉత్పత్తి చేసే నర్సరీలు మూడు వేలకు పైగా ఉన్నాయి. ఆయిల్ పామ్, అలంకార మొక్కలు, టిష్యూ కల్చర్.. తదితర నర్సరీలన్నీ కలిపి సుమారు ఆరు వేల దాకా ఉన్నాయి. వాటి వార్షిక వ్యాపార టర్నోవర్ సుమారు రూ 2,500 కోట్లు ఉంటుందని అంచనా.
ఈ నర్సరీలు నడిపే వ్యాపారులు ఫిబ్రవరి 28 లోపు లైసెన్సుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్తగా నర్సరీలు ఏర్పాటు చేయాలనుకునే వారు ఉద్యానవనశాఖకు దరఖాస్తు చేసుకోవాలి.. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలను అనుసరించి లైసెన్సులు జారీ చేయనున్నట్టు ఉద్యానవనశాఖ వెల్లడించింది. నర్సరీల లైసెన్సు కోసం మూల మొక్కలను ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నారో వివరాలు అందించాలి. షెడ్ నెట్, పాలీహౌస్‌లు తాము విత్తనాలు కొనుగోలు చేస్తున్న కంపెనీ వివరాలను స్పష్టంగా తెలియచేయాలి. నిబంధనలన్నీ చట్ట సవరణలకు లోబడి ఉంటే మూడేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైతే లైసెన్సులను రద్దు చేయనున్నారు. రైతులకు అమ్మిన మొక్కలకు ఖచ్చితంగా బిల్లులు ఇవ్వాలి. మొక్కల ధరలను ఇష్టారీతిన నిర్ణయించేందుకు అవకాశం లేదు. ఆయా నర్సరీల్లో ఉత్పత్తి చేసే మొక్కలతో వాటి ధరలను కూడా సమీప రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..