Tuesday, November 26, 2024

నర్సరీలకూ లైసెన్స్‌! షేడ్‌నెట్‌, పాలీహౌస్‌లకూ అంతే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యానవన రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యతలేని నర్సరీల కారణంగా తరచు నష్టపోతున్న నేపథ్యంలో వాటి ఆటకట్టించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ప్రతి ఏటా నర్సరీల్లో కొనుగోలు చేసిన మిరప, టమోటా మొక్కల కారణంగా నష్టపోయినట్లు రైతులు ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తున్నారు.. వీటన్నింటినీ నియంత్రించేందుకు ఉద్యానవన శాఖ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏపీ ఉద్యాన నర్సరీస్‌ రిజిస్ట్రేష్రన్‌ యాక్టు-2010లో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఉద్యాన నర్సరీల క్రమ బద్ధీకరణ చట్టం అమలులోకి వచ్చింది. నూతన చట్టం ప్రకారం నర్సరీలు, షేడ్‌నెట్‌, పాలీ హౌస్‌లతో పాటు నర్సరీ రంగంలో వ్యాపారం చేసే ప్రతీ ఒక్కరూ విధిగా లైసెన్సులు తీసుకోవాల్సి ఉంది. పై వాటి కోసం దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అధికారులు లైసెన్సు మంజూరు చేయాల్సి ఉంది.

చట్టం పరిథిలోకి మరికొన్ని..

కొత్త చట్టం పరిథిలోకి ప్ర స్తుతం ఉన్న చట్టం పరిధిలో శాశ్వత పండ్ల మొక్కల నర్సరీలు మాత్రమే ఉన్నాయి. చట్టం పరిధిలో లేని షేడ్‌నెట్‌లు, పాలీ హౌస్‌లు, నర్సరీల్లో కొన్ని ఉత్పత్తి చేసే నాసిరకం విత్తనాల బారిన పడి రైతులు ఏటా వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వీరి ఆగడాలకు చెక్‌ పెడుతూ రూపొందించిన నూతన చట్టం ఈ నెల18 నుంచి అమలులోకి వస్తుంది. ఇటీవలే గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది.

నెలాఖరుకల్లా లైసెన్సుల జారీ..

ప్రస్తుతం ఫిబ్రవరి నెలాఖరుకల్లా రాష్ట్రంలోని నర్సరీలన్నింటికీ లైసెన్సులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన చట్టం ప్రకారం వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకు ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, మొక్కలు వైఎస్సార్‌ ఆర్బీకేల ద్వారా సరఫరా అవుతాయి. వీఏఏ, వీహెచ్‌ఏల సహకారంతో రైతులు రాష్ట్రంలో ఏ నర్సరీ నుంచైనా మొక్కలను బుక్‌ చేసుకొని నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. ఇదిలావుండగా రాష్ట్రంలో 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 312.34 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. విత్తనాలు, మొక్కల కోసం మెజార్టీ రైతులు ప్రైవేటు నర్సరీలు, బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్న షేడ్‌నెట్‌లు, పాలీహౌస్‌లపై ఆధారపడుతున్నారు. రాష్ట్రంలోని 5,885 నర్సరీల ద్వారా ఏటా 422.5 కోట్ల మొలకలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 95 శాతం మిరప, టమోటా, కూరగాయలు, అరటి (టిష్యూ కల్చర్‌) పంటలవే. ఏటా రూ. 2,481.6 కోట్ల టర్నోవర్‌ సాధిస్తోన్న ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా 4.41 లక్షల మంది, పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement