- మీరు మోనంగా ఉండటం వల్లే రూ10 లక్షల కోట్ల అప్పు
- కనీసం జీతాలు కూడా కూడా ఇవ్వలేని దుస్థితి
- గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు సరిదిద్దండి
- ఎపిని అభివృద్ధి పధంలో నడిపేందుకు సహకరించండి
- చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేద్దాం
- అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం….
వెలగపూడి – మీ పని మీరు చేస్తే చాలు.. మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సచివాలయంలో నేడు జరిగిన జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పలు కీలక కామెంట్స్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా ఆయన రాష్ట్రానికి గూగుల్ తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనీయమని, సీఎం చంద్రబాబు నాయకత్వపు లక్షణాలకు ఇది నిదర్శనమని ప్రశంసించారు. అలాగే సీఎం చంద్రబాబు గొప్ప విజన్ తో పాలన సాగిస్తుంటే, అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. తాము కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజలకు ఇబ్బందులని తొలగించాలని కూటమి కట్టామని గుర్తు చేశారు.
తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చాయని అన్నారు పవన్ కల్యాణ్. ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. రెవెన్యూ అధికారుల ద్వారా సినిమా టిక్కెట్లు అమ్మించడం, ఇసుక దోపిడి, ఇంకా అనేక అక్రమాలు కూడా అధికారుల ద్వారా సాగించిందని తెలిపారు.
తాము అధికారంలో లేనప్పుడు సామన్యుడిలా బయట నుండి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంత మంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పక పోవడం ఏమిటన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిష్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పలు వచ్చాయని తెలిపారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని లేకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. సిరియా, శ్రీలంకలలో ఏం జరిగిందో చూశామన్నారు. సైబరాబాద్‌లో రాళ్లు, రప్పలు మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు.
కాగా, తమ పార్టీ కార్యాలయానికి వచ్చి జనం సమస్యలు చెప్తుంటే బాధ కలుగుతుందనన్నారు. మొన్నీమధ్య సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేసారన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి, మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు పోయారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ అక్రమాలను అరికట్టడం కలెక్టర్ల బాధ్యత కాదా ? ఎస్పీ బాధ్యత కాదా ? ఎలా వదిలేశారు ? చాలా నిరాశాజనకంగా ఉంది అంటూ నిష్టూరమాడారు పవన్. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదని,, నిస్వార్థంగా ప్రజలకోసం తాము పని చేస్తున్నా మీ సహకారం ఉండట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పవన్ సూచించారు.
ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం రూ.10లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. . స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్‌లో కూడా కల్తీ పెరిగిపోతోందని అంటూ స్వయానా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.