Saturday, September 14, 2024

AP: మట్టి గణపతితో పర్యావరణాన్ని కాపాడుకుందాం.. రామ్మోహన్ నాయుడు

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 : మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలో ఏడురోడ్ల కూడలి, మిల్లు జంక్షన్, పాత బస్టాండ్ వద్ద (శ్రీకాకుళం నియోజకవర్గంలో 12 ప్రదేశాల్లో) శుక్రవారం 30,000 మట్టి గణపతి విగ్రహాలు, వినాయక వ్రతకల్పం (పుస్తకం) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహాజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుల‌ విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమగా లభించే ప్లాస్టర్ ఆఫ్ పారీస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమర్జనం చేయడం వలన జలవనరులు కాలుష్యానికి గురికావడం జరుగుతుందని, వీటి వలన జల వనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష, జంతు జీవాలపై ప్రభావం కలుగుతుందన్నారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ పారీస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ… విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతి తో తయారయ్యే పత్తి, నారా వంటి పదార్థాలను వినియోగించుకోవాలని పర్యావరణ పరిరక్షణ వలన రానున్న భావితరాలకు మంచి వాతావరణం అందజేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement