తిరుపతి సిటీ, మే 2 (ప్రభ న్యూస్) : గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించుకుందామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జాతరలో భాగంగా మంగళవారం వివిధ ప్రాంతాల్లో భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో గంగమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ షోరూం సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ముత్యాల రెడ్డిపల్లి, వైకుంఠపురంకూడలి, రాళ్లపల్లి విగ్రహం, బాలాజీ కాలనీ, కృష్ణాపురం ఠాణా, నాలుగ్గాళ్ల మండపం, అశోక్ నగర్, సుందరయ్యనగర్, అన్నారావుసర్కిల్, సుభాష్.నగర్, కాటన్.మిల్, ఆటో నగర్ కూడళ్లలో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… అంగరంగ వైభవంగా జరగనున్న గంగమ్మ తల్లి జాతరలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. జాతరను ఘనంగా నిర్వహించుకుందామని, వేషాలు వేసి, అమ్మ వారి ఆశీస్సులు పొందుదామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, పాలక మండలి సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూమనకు చెక్కు అందజేసిన మత్స్యశాఖ అధికారులు…
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర నిర్వహణ కోసం తిరుపతి మత్స్యశాఖ అధికారులు తమ వంతుగా పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని పద్మావతి పురంలోని వారి నివాసం వద్ద కలుసుకుని చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖకు చెందిన రాజేష్ రెడ్డి, సుమంత్, వెంకట రమణ పాల్గొన్నారు.