(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : సమన్వయంతో ముందుకు వెళ్దామని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) కూటమినేతలు, కార్యకర్తలతో భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజన చౌదరి మాట్లాడుతూ… పశ్చిమ ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల విజయ దిపం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించామని పదిమంది విశ్రాంత ఐఏఎస్ ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీలు, ప్రైమరీ పాఠశాలల్లో పర్యటించి ప్లే స్కూల్ చిన్నారులకు, బాల బాలికలకు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడం, గర్భిణీ స్త్రీలకు అందించవలసిన పోషకాహారం మరియు సులభతరమైన కాన్పుల కోసం మెటర్నటీ వైద్యశాలలను కుడా ఏర్పాటు చేస్తున్నామని సుజనా తెలిపారు.
ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన పశ్చిమ ప్రజలందరూ పది తరాలు గుర్తుంచుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, సేవకుడిలా పని చేస్తానని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు. అందరం కలిసి సమన్వయంతో కలసి ముందుకెళ్దామన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ… ఎన్నికల్లో 47 వేల పైచిలుకు మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పనిచేస్తున్నారన్నారు.
పశ్చిమంలో విద్యా, వైద్యం, తాగునీరు, ప్రసూతి వైద్యశాలలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి సుజనా చౌదరి కట్టుబడి ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూటమి నేతలు షేక్ బాజీ, పైలా సోమినాయుడు, బుల్లా విజయ్, మల్లెపు విజయలక్ష్మి, గుడివాడ నరేంద్ర రాఘవ, డివిజన్ల అధ్యక్షులు, కూటమి నేతలు పాల్గొన్నారు.