(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఎన్‌టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్‌గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ, డీఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ రూరల్ పరిధిలోని ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్.వీరరాఘవయ్య 15రోజుల కింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో, అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని.. ఈ పథకం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్దఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ.78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. దాదాపు 20ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందొచ్చని వివరించారు. 3కేవీ వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని.. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని, ఈ విధంగా గత రెండు నెలల్లో లబ్ధిదారులకు రూ.33లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు.
పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని.. ఇప్పటి వరకు దాదాపు 60వేల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. సౌర శక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందొచ్చని.. పథకం అమల్లో జిల్లాను నెం.1గా నిలపడంలో, పునరుత్పాదక ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, నోడల్ అధికారి ఎం.భాస్కర్, సర్పంచ్ ఆర్.పూర్ణచంద్రరావు, వైస్ సర్పంచ్ టీవీవీఎస్ ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.