ప్రశ్నించడం అంటే మార్పునకు శ్రీకారం అని.. ప్రశ్నించడం చాలా బలమైన ఆయుధమని, అందరూ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిలో ఇవ్వాల జరుగుతున్న జనసేన ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికగా ఆయన మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సన్నద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఇంతకుముందు వైసీపీకి అధికారం ఇస్తే వాళ్లు ఏం చేస్తున్నారో మనం కళ్లారా చూస్తున్నామని, అయితే వైసీపీలోనూ కొంతమంది మంచి నేతలున్నారని కితాబిచ్చారు. అశుభంతో వైసీపీ పాలన ప్రారంభించిందని జనసేనాని విమర్శించారు. ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. అధికారంలోకి రాగానే కూల్చడం ప్రారంభించారు. ఇది అంత మంచి శకునం కాదు.
గత ఎననికల్లో ఏడు శాతానికి పైగా ఓట్లు సాధించాం.. ఇక రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటిచెప్పాలి.. అధికారం కైవసం చేసుకుని అందరికీ ఆదర్శవంతమైన పాలన అందించాలని కోరారు. వైసీపీ నాయకత్వంపై తనకు ఎలాంటి ద్వేశాలు లేవని, గత ఎన్నికల్లో 151 సీట్లు ఇస్తే మీరేం చేస్తున్నారో ఆలోచించాలి అని వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీని ప్రశ్నించారు పవన్..ఆ పార్టీలోనూ మంచి నేతలున్నారని ఉమ్మారెడ్డి, మాగంటి, మేకపాటి, ఆనం లాంటి వారు ఎంతో హూందాగా ఉంటారన్నారు. బహిరంగ సభ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు.