Tuesday, November 19, 2024

Less Turnout – ఓటెత్తింది తక్కువే..! ఐదు విడతల్లో భారీగా తగ్గిన పోలింగ్‌


ఓటింగ్ పై ప్ర‌జ‌లు అనాస‌క్తి
428 సీట్లలో ఓటేసింది 50.7 కోట్ల మంది
2019లో పోలైన ఓట్లు 70.1 కోట్లు!
20 రాష్ట్రాలు, యూటీల్లో తక్కువ ఓటింగ్‌
పార్టీల‌లో కొత్త గుబులు
ఏపీ, తెలంగాణాల‌లో నిల‌క‌డ‌గా పోలింగ్

సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా.. ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఏమైనా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్‌ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌లో ఏప్రిల్‌ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్‌ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్‌ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

- Advertisement -

ఓటర్లు ఎక్కువేనా.. ఓటేసింది తక్కువే
తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్‌ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్‌ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉంటే మొత్తం ఓటింగ్‌ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది.

20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్‌…
ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్‌ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్‌ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్‌ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్‌), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది!

క‌శ్మీర్ లో పోటెత్తారు…
దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఎపి, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్‌ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్‌ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్‌ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. తెలంగాణ‌,ఎపిల‌లో గతం కంటే రెండు శాతం పోలింగ్ జ‌ర‌గ‌డం విశేషం

Advertisement

తాజా వార్తలు

Advertisement