న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి గురువారం జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సరైన చొరవ తీసుకోకపోవడం వల్లే లేపాక్షి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో లేదని జీవీఎల్ అన్నారు.
లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, తన కృషి సానుకూల ఫలితాలనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ సాంస్కృతిక వారసత్వ సంపద కంటే జిన్నా వారసత్వాన్ని కాపాడుకోవడం మీదే వైసీపీ ఎక్కువ ఆసక్తి చూపుతోందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. వైసీపీకి జిన్నా ముద్దు-ఆంధ్ర సంస్కృతి వారికొద్దని విమర్శించారు.