ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు సావనీర్‌గా మన హస్త కళాకారుల రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు మాత్రమే ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధానికి వెళ్లినప్పుడు మర్యాద పూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలు లేపాక్షి నుంచే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను ఆయన పరిశీలించారు. మంగళగిరిలోని పవన్ నివాసానికి లేపాక్షి ప్రతినిధులు కొన్ని కళాకృతులను తీసుకుని వచ్చారు. శ్రీకాళహస్తి పెన్ను, కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్నులు, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలన్నీ వీటిలో ఉన్నాయి. వాటిలో ఎంపిక చేసిన వాటికి గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు. అంతే కాకుండా… అతిథులకు ఇచ్చే జ్ఞాపికల ఖర్చులో 60% తానే భరిస్తామని చెప్పారు. ఈ మేరకు కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.