తిరుమల శ్రీవారి భక్తుల్ని చిరుతల భయం వెంటాడుతూనే ఉంది. ఓ చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకునేలోపే, మరో చిరుత కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఐదు చిరుతల్ని బంధించినా, అసలు ఎన్ని ఉన్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. చిరుత పులులే అనుకుంటే వాటికి తోడు ఎలుగుబంట్లు కూడా బెంబేలెత్తిస్తున్నాయ్. ఓ అంచనా ప్రకారం 50కి పైగా చిరుతలు, పదికి పైగా ఎలుగుబంట్లు ఉన్నట్టు లెక్కగట్టారు. ఈ క్రూర మృగాలు నడక మార్గాల వైపే ఎందుకొస్తున్నాయ్? ఈ అనుమానమే టీటీడీకి, ఫారెస్ట్ అధికారులకీ వచ్చింది. దట్టమైన అడవి మధ్యన ఉండాల్సిన చిరుత పులులు, ఎలుగుబంట్లు… అసలెందుకు ఇక్కడికి వస్తున్నాయో కనిపెట్టేందుకు అధ్యయనం చేపట్టారు. ఆ స్టడీలో సంచలనం విషయం బయటపడింది.
నడక మార్గాల్లో ఉండే ఫుడ్ కోర్ట్స్, ఆ రూట్‌లో ఆహార వ్యర్ధాలను పడేయడమే అటువైపు చిరుతలు రావడానికి ప్రధాన కారణమంటున్నారు సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి. ఎక్కడైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆహార వ్యర్ధాలను పడేస్తున్నారో అక్కడే చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు.
ట్రాప్ కెమెరాల్లో కూడా అక్కడే చిరుతల సంచారం కనిపించందన్నారు. ఆహార వ్యర్ధాలను తినేందుకు వస్తోన్న జంతువుల్ని ఈజీగా వేటాడేందుకే చిరుతలు, ఎలుగుబంట్లు అక్కడికి వస్తున్నట్టు చెప్పారు. అందుకే, కాలిబాటలో ఆహార పదార్ధాలను పడేయకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం 500 లకు పైగా హైక్వాలిటీ ట్రాప్ కెమెరాలతో మానిటరింగ్ జరుగుతోందని, త్వరలో ఎలివేటెడ్ వాక్‌వేస్, ఏరియల్ ఫుట్‌పాత్స్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. కాగా, మరో చిరుత సంచారాన్ని గుర్తించామన్నారు. అయితే, లక్షితపై దాడిచేసిన చిరుతను బంధించేవరకు ఆపరేషన్ కొనసాగుతుందన్నారు సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి