Sunday, June 30, 2024

Leopard : బోనులో చిక్కిన చిరుత.. మేకను ఎరగా వేసి..

కర్నూల్ బ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది పరిధిలోని పచ్చర్ల గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీశాఖ ఉచ్చులో చిక్కింది. పచ్చర్ల అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా సాధారణ ప్రజలపై దాడికి దిగుతున్న చిరుత ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా మూడు రోజుల క్రితం పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మెహరున్నీసా అనే మహిళ వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లగా ఆమెపై దాడి చేసి చంపేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది.

చిరుత వరుస దాడులతో బెంబేలెత్తిన గ్రామస్తులు గిద్దలూరు చిరుతను బంధించాలని హైవే రోడ్డును దిగ్భంధించి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో హై అలర్ట్ అయిన అధికారులు నల్లమల పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు అటవీ అధికారుల ఉచ్చుకు చిరుత బోనులో చిక్కింది. మేకను ఎరగా వేసి బోనులో బంధించారు. చిరుత పట్టుబడటంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, బోనులో చిక్కిన చిరుత, మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఒక్కటేనా లేదంటే ఇంకో చిరుతనా అన్న అనుమానం అటవీశాఖ అధికారులకు క‌లుగుతోంది. ప్రస్తుతం పట్టుబడిన చిరుత వయస్సు 5 నుండి 6 సంవత్సరాలు ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. పచ్చర్ల వద్ద బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్ కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement