Saturday, November 23, 2024

కృష్ణా జలాలను రాయలసీమకు మల్లించాలి

నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా- పెన్నా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి నిధులు కేటాయించడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను కేటాయించడంతో, ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా పెన్నా ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసందానంతోపాటు, శ్రీశైలం రిజర్వాయర్ ను పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ‌, ప్రకాశం, మహబూబ్ నగర్ జల్లాల నీటి అవసరాలకు వినియోగించేలాగా కృష్ణా పెన్నార్ ప్రాజక్టు డి.పి.ఆర్ రూపొందించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న ఆన్ని ప్రాజక్టులను కొనసాగిస్తామని పేర్కొన్నారని, కానీ, గోదావరి నదిని కృష్ణా నదికి అనుసంధానం చేసే దుమ్మగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించలేదన్నారు. దీంతో రాయలసీమ ప్రాజక్టులకు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చట్టబద్దంగా నీటి హక్కు పొందడంలో ప్రతిబంధకం ఏర్పడిందని అన్నారు. ఈ విషయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాలు నితిన్ గడ్కరికి కేంద్ర జలవనురుల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు వివరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో రాయలసీమ ఆవసరాలు తనకు తెలుసునని, రాయలసీమ సాగునీటి అవసరాల ప్రాధాన్యతతో నదుల అనుసంధాన ప్రక్రియ   చేపడుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా మోసపోతున్న రాయలసీమకు న్యాయం జరిగే అవకాశం కృష్ణా పెన్నార్ అనుసంధానం ద్వారా లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాయలసీమ రాజకీయ నాయకులు క్రియాశీలక పాత్ర వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా – పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా, రాయలసీమకు న్యాయం జరగకుండ మోకాలు అడ్డే కార్యక్రమాలకు కొందరు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement