తల్లి, చెల్లిపై జగన్ ఏకంగా లా ట్రైబ్యునల్‌లో పిటిషన్
సరస్వతి పవర్ లో ఆ ఇద్దరి వాటాలు తొలగిస్తు నిర్ణయం
వారికి ఎటువంటి వాటాలు లేవని పేర్కొన్న జగన్
విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్
నవంబర్ 8న పూర్తి స్థాయిలో విచారణ
విజయమ్మ, షర్మిలలకు నోటీసులు
అమరావతి – సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవంక సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతోండగా.. మరోవంక కుటుంబపరంగా లుకలుకలను ఎదుర్కొంటోన్నారు.
కుటుంబంలో..
ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా పిటీషన్లు వేసే స్థాయికి వెళ్లింది. గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతాలే జగన్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి.
క్లాట్‌లో..
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ పిటీషన్ వేశారు.
నవంబర్ 8న..
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. కంపెనీల యాక్ట్ 59 కింద వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ సెప్టెంబర్ 10వ తేదీన ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని క్లాట్ విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై విజయమ్మ, షర్మిలకు నోటీస్ లు జారీ చేసినట్లు సమాచారం..
క్లాజ్ 59 ఏంటీ?
కంపెనీ యాక్ట్ క్లాజ్ 59 ప్రకారం- సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్‌లో ఒకరి పేరును నమోదు చేయడం లేదా తొలగించితే దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ క్లాజ్ కిందే వైఎస్ జగన్, వైఎస్ భారతి క్లాట్‌లో పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
షర్మిలకు భాగస్వామ్యం..
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామని జగన్, భారతి తమ పిటీషన్‌లో పొందుపరిచారు. ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో షర్మిలకు వాటాలు ఇవ్వడానికి అంగీకరించారు.
వాటాలు ఇవ్వడానికి ఒప్పందం..
ఈ మేరకు 2019 ఆగస్టు 21వ తేదీన ఒక అవగాహన ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నారు. సరస్వతి పవర్స్ ద్వారా షర్మిలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, అందులో వాటా ఇవ్వడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై జగన్, భారతి సంతకం చేశారు. ఈ వాటాల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు.
ప్రత్యర్థి కావడం..
చెల్లెలు అనే ఒకే ఒక్క కారణంతో 2019లో షర్మిలకు వాటాలు ఇవ్వడానికి జగన్ అంగీకరించారని, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారడం, రాజకీయంగా ప్రత్యర్థి కావడం వల్ల సరస్వతి పవర్‌లో వాటాలను ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆ కారణంతోనే జగన్, భారతి తాజాగా క్లాట్‌ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.