అమరావతి, ఆంధ్రప్రభ: ‘రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే. సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ల కాలంలో బలవన్మరణాలకు పాల్పడ్డార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కౌలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈ నెల 8వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడతారని, శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్ కల్యాణ్ సాయం అందిస్తారన్నారు.
ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటు-ంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లా వస్తారని చెప్పారు. రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తామని వివరించారు. కౌలు రైతులకు ఆర్థికంగా సాయపడే ఈ గొప్ప కార్యక్రమం గురించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రతి రైతుకీ తెలియజెప్పాలని, వారికి చేస్తున్న సాయం గురించి వివరించాలని కోరారు. రైతులకు తన వంతు సాయం చేస్తున్న పవన్ కల్యాణ్ గొప్ప ఆలోచనను ప్రజలకు చెప్పాలన్నారు.
చౌకబారు విమర్శలు మానుకోవాలి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద మంత్రులు, వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేయడం మాని రైతులకు సాయం అందించే పనిపై దృష్టిపెట్టాలని మనోహర్ సూచించారు. కౌలు రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించే వైసీపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర మొదలు పెట్టగానే అదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.లక్ష వేస్తున్నారని, ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.7 లక్షల సాయం అందాలని అన్నారు. ఈ పూర్తి సాయం అందే వరకు జనసేన పార్టీ పోరాటం ఆగదని, చిత్తశుద్ధి నిరూపించుకొని ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం మీద దృష్టిపెట్టాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..