రాయలచెరువు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది…ఈ మధ్యకాలంలో రాయలచెరువు అంటేనే.. ఏంటీ గండి పడిందా.. అయితే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అనేలా భయపెట్టేలా చేస్తోంది…. గత కొంత కాలంగా ఏపీలో భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ భారీ వర్షాలతో వాగుల, వంకలు పొంగిపొర్లుతుంటే.. చెరువు కట్టలు తెగిపోవడంతో కింద ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి పరిధిలోని రాయల్ చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
రాయల చెరువుకు ఇప్పటికే గండి పడడంతో అధికార యంత్రాంగం దానిని పూడ్చేపనిలో నిమగ్నమైంది. ఇప్పుడు కింది గ్రామాలు ఉలిక్కిపడేలా రాయల చెరువుకు మరో 3 చోట్ల నుంచి నీరు లీకవుతోంది. వరద నీరు రాయల చెరువుకు కొనసాగుతుండడంతో ఎక్కువగానే నీటిని వదులుతున్నారు. అయినప్పటికీ చెరువుకు లీకుల బెడద తప్పడం లేదు. అయితే ఊట నీరుతోనే చెరువుకు వరసగా లీకేజీలు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కింది గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏ విధంగా జలప్రళయం సంభవిస్తుందోనని భయాందోళనలో ఉన్నారు. అధికారులు చెరువువద్దకు టన్నుల కొద్దీ బండరాళ్లు, ఇసుక, సిమెంట్ కంకరను తరలించారు. చెరువు మొరవ ప్రాంతంలో లోతుతీసి నీరు బయటకు తరలించేందుకు పొక్లైన్లు పనిచేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..