Friday, October 18, 2024

Condolences – రామోజీరావు వ్య‌క్తి కాదు శ‌క్తి – వెంక‌య్య నాయుడు

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. తెలుగు వారందరికీ గర్వకారణమైన రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు.


క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనదని తెలిపారు. తెలుగు భాష-సంస్కృతులకు చేసిన సేవ చిరస్మరణీయమైనదని వెల్లడించారు. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన ఆయన క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనదని చెప్పారు.

- Advertisement -

అచ్చెన్నాయడు సంతాపం..

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు అచ్చెన్నాయుడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సిపిఐ రామకృష్ణ…
గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల మా ప్రగాఢ సంతాపం అంటూ ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు.. ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత ఆయనదే.. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు రామకృష్ణ.. మరోవైపు మీడియా దిగ్గజం రామోజీరావు గారి అస్తమయం చాలా బాధాకరం అన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి.. సామాన్యుడి గొంతుకను ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు.. అనేక కళలను గుర్తించి, వెలికితీసి వారిని ప్రోత్సహించిన రామోజీరావు మరణ వార్త హృదయాన్ని ద్రవింపజేసింది అన్నారు స్వరూపానందేంద్ర సరస్వతీ.

ఈటెల రాజేందర్ సంతాపం…

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతి పట్ల సీనియర్‌ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారు. వారు జీవితాంతం కట్టుబడి మరియు క్రమశిక్షణతో ఉంటారు. ఏ పని చేపట్టినా నైతిక విలువలను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వకారణం. యావత్ ప్రపంచానికి తెలుగు శక్తిని చాటిచెప్పిన రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారు. రామోజీరావుకు వామపక్ష భావజాలం ఉండేది. రామోజీ రావు మహనీయులు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఈటల రాజేందర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement